మేడారం వనదేవతల పూజారి దారుణ హత్య

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం వనదేవతల పూజారి సోమవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వర్‌రావు కథనం ప్రకారం.. ఏటూరునాగారం మండలం కొండాయికి చెందిన దబ్బకట్ల రవి(45).

Published : 22 Mar 2023 03:54 IST

తాడ్వాయి, న్యూస్‌టుడే: ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం వనదేవతల పూజారి సోమవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వర్‌రావు కథనం ప్రకారం.. ఏటూరునాగారం మండలం కొండాయికి చెందిన దబ్బకట్ల రవి(45) మేడారానికి చెందిన శ్రీలతను వివాహం చేసుకొని అక్కడే నివసిస్తున్నారు. నెలలో వారంపాటు ఆలయ ప్రాంగణంలో గోవిందరాజు గద్దెపై పూజలు నిర్వహిస్తుంటారు. మిగతా రోజుల్లో వ్యవసాయ పనులు చేస్తుంటారు. వంతులో భాగంగా ఈనెల 20 నుంచి గద్దెపై పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలో సిద్దిపేటకు చెందిన ఓ వ్యక్తి వనదేవతల దర్శనానికి వచ్చి రవితో పరిచయం పెంచుకుని బయటికి రావాల్సిందిగా కోరాడు. దీంతో పూజల బాధ్యతను కుమార్తె నందినికి అప్పగించి అతనితో కలిసి రవి వెళ్లారు. మంగళవారం పగిడిద్దరాజు పూజారి పెనక మురళీధర్‌ ఇంటి సమీపంలో రవి మృతదేహాన్ని గ్రామస్థులు గమనించి పోలీసులకు సమాచారమందించారు. బండరాళ్లతో తలపై మోదడంలో ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. సంఘటన స్థలానికి పస్రా సీఐ శంకర్‌, ఎస్సై, క్లూస్‌ టీంసభ్యులు వచ్చి ఆధారాలు సేకరించారు. రవి కుమార్తె నందిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

మిస్టరీగా హత్య

రవి హత్య ఎవరు చేశారు.. ఎందుకు చేశారనేది మిస్టరీగా మారింది. మృతుడి తల్లికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో హనుమకొండలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో రవి భార్య శ్రీలత అక్కడే ఉండి అత్తకు సపర్యలు చేస్తున్నారు. హత్య జరిగిన ప్రదేశంలో ఇద్దరు పురుషులు, ఒక మహిళ శనివారం నుంచి తిష్ఠ వేసినట్లు స్థానికులు చెబుతున్నారు. మద్యం మత్తులో హత్య జరిగిందా.., పథకం ప్రకారం చేశారా అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు