Vijayawada: విజయవాడలో డ్రగ్స్‌ స్వాధీనం

విజయవాడలో ఓ యువకుడి నుంచి డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.   పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఎం.సతీష్‌... కాకినాడలో చదువుకుంటున్నాడు.

Updated : 22 Mar 2023 09:15 IST

ఈనాడు, అమరావతి: విజయవాడలో ఓ యువకుడి నుంచి డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.   పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఎం.సతీష్‌... కాకినాడలో చదువుకుంటున్నాడు. అతనికి అక్కడే ఓ కళాశాలలో ఫోరెన్సిక్‌ కోర్సు చదువుతున్న కేరళకు చెందిన అబ్దుల్‌ మిషాల్‌ అహ్మద్‌ పరిచయం అయ్యాడు. అతని ప్రోద్బలంతో డబ్బు సంపాదించొచ్చన్న ఆశతో గంజాయి రవాణాను ఆదాయ వనరుగా ఎంచుకున్నాడు. ఏజెన్సీలోని చింతపల్లి నుంచి గంజాయి తీసుకొచ్చి.. బెంగళూరుకు తీసుకెళ్లి ఇచ్చేవాడు. ఇందుకోసం సతీష్‌కు మిషాల్‌ డబ్బులిచ్చేవాడు. బెంగళూరులో మిషాల్‌ సొంతంగా ఎండీఎంఏ(మిథలీన్‌ డైఆక్సీ మెటాఫెటామిన్‌) అనే డ్రగ్‌ను క్రిస్టల్‌ రూపంలో తయారు చేయడం ప్రారంభించాడు. దీనిని కాకినాడ, హైదరాబాద్‌లోని కస్టమర్లకూ సరఫరా చేసేవాడు. 6 నెలలుగా బెంగళూరు నుంచి ఎండీఎంఏను తీసుకొచ్చి సతీష్‌ విక్రయిస్తున్నాడు. ఈనెల 1న కాకినాడ నుంచి బెంగళూరుకు రైలులో బయలుదేరాడు. అక్కడే మిషాల్‌ గదిలో 3 రోజులు బసచేశాడు. తిరిగి 5న కాకినాడకు 48.6 గ్రాముల డ్రగ్స్‌ను పాయసం మిక్స్‌ డబ్బాలో పెట్టుకుని బయలుదేరాడు. దీనిని పెద్దాపురంలో తమిళనాడుకు చెందిన మహేంద్రన్‌, కేరళకు చెందిన గోకుల్‌ కృష్ణన్‌కు, హైదరాబాద్‌కు చెందిన అఖిల్‌, కాకినాడలో అలెక్స్‌, విజయ్‌లకు సరఫరా చేసేందుకు డబ్బు తీసుకున్నాడు. బెంగళూరు నుంచి కాకినాడకు వస్తూ.. విజయవాడలో దిగిపోయాడు. అక్కడే పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని