జాతరలో ఘర్షణ.. దళిత యువకుడి మృతి

అమ్మవారి జాతర చూసేందుకు వెళ్లిన ఓ దళిత యువకుడు అక్కడ జరిగిన ఘర్షణలో మృతి చెందారు. ఈ సంఘటనలో పలువురికి గాయాలయ్యాయి.

Published : 23 Mar 2023 04:21 IST

తొండంగి, తుని, న్యూస్‌టుడే: అమ్మవారి జాతర చూసేందుకు వెళ్లిన ఓ దళిత యువకుడు అక్కడ జరిగిన ఘర్షణలో మృతి చెందారు. ఈ సంఘటనలో పలువురికి గాయాలయ్యాయి. దీనికి సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలివి. కాకినాడ జిల్లా తొండంగి మండలం శృంగవృక్షం గ్రామంలో మంగళవారం రాత్రి గ్రామదేవతల జాతర జరుగుతోంది. బుధవారం తెల్లవారుజామున రెండింటి ప్రాంతంలో జాతరలో రెండు వర్గాల మధ్య స్వల్ప వివాదమేర్పడి ఘర్షణకు దారితీసింది. ఎస్సీ వర్గానికి చెందిన నడిపల్లి రాము, నక్కా నాగేశ్వరరావు, పులుగు భాను, సిద్ధాంతపు రవి, గంగబాబు, అప్పలకొండ తదితరులపై మరో వర్గం వారు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. దీంతో వారు తీవ్ర గాయాలపాలయ్యారు. తన అమ్మమ్మ ఊరు శృంగవృక్షంలో జాతర చూసేందుకు తొండంగి నుంచి వచ్చిన నడిపల్లి రాము(23)కు ఈ ఘర్షణలో తీవ్ర గాయాలయ్యాయి. ఆయన్ని తొండంగి పీహెచ్‌సీకి తరలించారు. అక్కడి నుంచి తుని ఆసుపత్రికి ఆటోలో తీసుకెళుతుండగా మార్గమధ్యలో మృతి చెందారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు చనిపోయారంటూ రాము తల్లిదండ్రులు గంగ, నాగేశ్వరరావు, వారి బంధువులు ఆరోపించారు. ఘర్షణను నియంత్రించాల్సిన పోలీసులు పట్టనట్లు వ్యవహరించారని దళిత సంఘాలు శృంగవృక్షం ప్రధాన రహదారిపై మృతదేహంతో ధర్నా చేశాయి. బాధ్యులైన సూర్యచక్రం, సురేష్‌, బస్సా గంగ, సాయిభాస్కర్‌ తదితరులు 13 మందిని అరెస్టు చేయాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. నిందితులకు పోలీసులు కొమ్ము కాస్తున్నారని, మంత్రి దాడిశెట్టి రాజా అండగా ఉన్నారంటూ నినాదాలు చేశారు. సాయంత్రం ఐదున్నరనుంచి ఏడింటి వరకు రహదారిపైనే బైఠాయించారు. ఘర్షణ నేపథ్యంలో గ్రామంలో పోలీసులు పికెట్‌ నిర్వహించారు. ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధ్యులను అరెస్టు చేశామని, వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేశామని తెలిపారు.

ఆర్థికసాయం అందజేత

తుని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో రాము మృతదేహానికి మంత్రి దాడిశెట్టి రాజా నివాళి అర్పించారు. మృతుడి కుటుంబీకులను పరామర్శించి రూ.2 లక్షల ఆర్థికసాయం అందించారు. గాయపడినవారు ఒక్కొక్కరికీ రూ.50 వేల చొప్పున అందజేశారు. ప్రభుత్వపరంగా ఆదుకుంటామని, నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీనిచ్చారు. బాధిత కుటుంబాన్ని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యనమల కృష్ణుడు పరామర్శించారు. నిందితులను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డీజీపీకి లేఖ రాశారు. ‘జాతరకు వెళ్లిన దళిత యువకులపై దాడి చేయడమే కాకుండా దళితపేటలోకి వెళ్లి ఇళ్లలోని వారిని కొట్టారు. ఈ క్రమంలో రాము చనిపోయారు. నిందితులను ఇంతవరకూ అరెస్టు చేయలేదు’ అని లేఖలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని