అంగట్లో 16.8 కోట్ల మంది వ్యక్తిగత సమాచారం

దేశవ్యాప్తంగా   16.8 కోట్ల మంది వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసి అడ్డదారిలో విక్రయిస్తున్న యూపీ ముఠా గుట్టును సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు ఛేదించారు.

Published : 24 Mar 2023 03:37 IST

రక్షణ, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల డేటా కూడా తస్కరణ
విద్యార్థులు, వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ఈ-కామర్స్‌ సంస్థల వినియోగదారులవీ..
ధర నిర్ణయించి విక్రయిస్తున్న ముఠా
గుట్టు రట్టు చేసిన సైబరాబాద్‌ పోలీసులు
లోతైన దర్యాప్తు కోసం సిట్‌ ఏర్పాటు

ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా   16.8 కోట్ల మంది వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసి అడ్డదారిలో విక్రయిస్తున్న యూపీ ముఠా గుట్టును సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు ఛేదించారు. రక్షణ రంగంలో పనిచేసే కొందరు అధికారుల ర్యాంకులు, మెయిల్‌ ఐడీలు, పోస్టింగుల వివరాలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఉద్యోగులు, కోట్లాది మంది వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ఓటీటీ ఖాతాదారుల సమాచారం నిందితుల దగ్గర దొరకడం సంచలనం రేకెత్తిస్తోంది. కొన్నేళ్లుగా ఈ చీకటి వ్యాపారం చేస్తోన్న ముఠాలోని ఏడుగురిని గురువారం అరెస్టు చేశారు.

వారి నుంచి 12 ఫోన్లు, 3 ల్యాప్‌టాప్‌లు, 2 సీపీయూలు, జస్ట్‌ డయల్‌కు చెందిన మెయిళ్లు, డేటా స్వాధీనం చేసుకున్నారు. సంచలనం సృష్టించిన ఈ కేసు వివరాలను డీసీపీలు కల్మేశ్వర్‌ సింగెనవార్‌, రితిరాజ్‌, సైబర్‌క్రైమ్‌ ఏసీపీ శ్రీధర్‌లతో కలిసి సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు కల్మేశ్వర్‌ సింగెనవార్‌ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.  

‘పాన్‌ కార్డు ఉన్నవారు, ఈ-కామర్స్‌ సంస్థల వినియోగదారులు, డీమ్యాట్‌ ఖాతాదారుల లావాదేవీలు, నీట్‌, సీబీఎస్‌ఈ విద్యార్థులు, రుణాలు, బీమా, క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తుల సమాచారం ఈ ముఠా వద్ద ఉంది. వివిధ టెలికం ప్రొవైడర్ల సిమ్‌కార్డులు వినియోగించే మూడు కోట్ల మంది వివరాలూ వీరివద్ద లభ్యమయ్యాయి. దేశ భద్రతకే ముప్పు వాటిల్లేలా ప్రభుత్వ సంస్థలకు చెందిన సున్నిత, రహస్య సమాచారాన్ని ‘జస్ట్‌ డయల్‌’ వేదికగా ఈ ముఠా విక్రయిస్తోంది. సైబరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి తనకు పదేపదే సైబర్‌ నేరగాళ్ల నుంచి కాల్స్‌ వస్తున్నాయంటూ ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టి నోయిడాలో నిందితులను పట్టుకున్నాం’ అని వెల్లడించారు.

వివిధ కేటగిరీల సమాచారం

‘ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన కుమార్‌ నితీశ్‌ భూషణ్‌ ఈ ముఠా ప్రధాన సూత్రధారి. అదే రాష్ట్రానికి చెందిన కుమారి పూజా పాల్‌, సుశీల్‌ తోమర్‌, అతుల్‌ ప్రతాప్‌ సింగ్‌, ముస్కాన్‌ హసన్‌, సందీప్‌ పాల్‌, జియా ఉర్‌ రెహ్మాన్‌ ఇతనికి సహకరిస్తుంటారు. 138 కేటగిరీలకు చెందిన డేటాను వీరు సేకరించారు. వివిధ సంస్థలకు చెందిన వ్యక్తుల నుంచి దొడ్డిదారిలో సేకరించి.. అడిగిన వారికి రూ.2 వేలకు 15 వేల మంది డేటా లెక్కన అమ్మేస్తున్నారు. ఇలా సంపాదించిన డబ్బుతో నొయిడాలో నితీశ్‌ భూషణ్‌ ఇల్లు, బంగారం కొనడంతోపాటు పర్యాటక ప్రాంతాల్లో జల్సాలు చేస్తున్నాడు.  

నోయిడాలో నితీశ్‌ భూషణ్‌ డేటా మార్ట్‌ ఇన్ఫోటెక్‌ పేరుతో కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయగా కుమారి పూజాపాల్‌ టెలీకాలర్‌గా, సుశీల్‌ తోమర్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు.

అతుల్‌ ప్రతాప్‌ సింగ్‌ ఇన్‌స్పైర్‌ డిజిటల్‌ పేరుతో సంస్థ పెట్టి క్రెడిట్‌ కార్డు ఖాతాదారుల సమాచారం సేకరించి విక్రయిస్తాడు.

ముస్కాన్‌ హసన్‌కు ఎంఎస్‌ డిజిటల్‌ గ్రోవ్‌ సంస్థ ఉంది. డేటా విక్రయంలో మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది.

సందీప్‌ పాల్‌ రహస్య సమాచారం విక్రయించేందుకు గ్లోబల్‌ డేటా ఆర్ట్‌ పేరిట సంస్థ ఏర్పాటు చేశాడు. జస్ట్‌ డయల్‌, సామాజిక మాధ్యమాల ద్వారా సైబర్‌ మోసగాళ్లు, ఇతర వ్యక్తులకు సమాచారం విక్రయిస్తున్నాడు.

జియా ఉర్‌ రెహ్మాన్‌.. నితీశ్‌, ప్రతాప్‌ సింగ్‌లకు గంపగుత్త సందేశాలు పంపేందుకు సహకరిస్తుంటాడు’ అని వివరించారు.


‘జస్ట్‌ డయల్‌’ వీళ్ల అడ్డా

దంతా చట్టవిరుద్ధమని తెలిసినా ‘జస్ట్‌ డయల్‌’.. నిందితులకు సహకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎవరిదైనా వ్యక్తిగత సమాచారం కావాలని జస్ట్‌ డయల్‌కు ఫోన్‌ చేస్తే నిందితుల సంస్థల్ని సంప్రదించాలంటూ సూచిస్తోంది. ‘‘కేవైసీ, ఇతర వివరాలు సమర్పించే ప్రక్రియలో ప్రైవేటు సంస్థలు వ్యక్తిగతంగా ముఖ్యమైన సమాచారం సేకరిస్తున్నా, భద్రపరచడంలో లోపాలున్నాయి. ఫలితంగానే ప్రజల సమాచారం సైబర్‌ నేరగాళ్లకు చేరుతోంది. ఈ నేపథ్యంలో డేటా భద్రత ఎంతో ముఖ్యం, దీనిపై ప్రత్యేక చట్టం అవసరం’’ అని స్టీఫెన్‌ రవీంద్ర పేర్కొన్నారు. జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉన్న నేపథ్యంలో సిట్‌ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నామని.. అసలు సమాచారం ఎక్కడి నుంచి లీకైందనే అంశంపై లోతుగా పరిశీలిస్తున్నట్లు వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు