కుప్పకూలిన మూడంతస్తుల భవనం

విశాఖపట్నంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మూడంతస్తుల భవనం కుప్పకూలి ముగ్గురు నిద్రలోనే ఊపిరొదిలారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

Published : 24 Mar 2023 04:12 IST

నిద్రలోనే ముగ్గురి మృతి
మృతుల్లో అన్నాచెల్లెళ్లు
కుమారుడి పుట్టినరోజునే ఓ కుటుంబంలో విషాదం
విశాఖ రామజోగిపేటలో ఘోర ప్రమాదం

ఈనాడు-విశాఖపట్నం, జగదాంబకూడలి, న్యూస్‌టుడే: విశాఖపట్నంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మూడంతస్తుల భవనం కుప్పకూలి ముగ్గురు నిద్రలోనే ఊపిరొదిలారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కొన్ని గంటల ముందే పుట్టినరోజు వేడుకలు జరుపుకొన్న కుమారుడితో పాటు కుమార్తె కూడా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబంలో అంతులేని విషాదం నెలకొంది. స్థానికులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖలోని రామజోగిపేటలో ఒమ్మి ఆదినారాయణ, రామకృష్ణ సోదరులకు మూడంతస్తుల భవనం ఉంది. ఇందులో మూడు కుటుంబాలు అద్దెకు ఉంటున్నాయి. కింది ఇంట్లో.. జగదాంబ మక్కా మసీదు దగ్గర ఫాస్ట్‌ఫుడ్‌ దుకాణంలో పనిచేస్తున్న బిహార్‌కు చెందిన రామ్‌ గులాజ్‌ సాహూ అలియాస్‌ చోటూ (28), విజయవాడకు చెందిన కొమ్మిశెట్టి శివశంకర్‌ ఉంటున్నారు. వీరిద్దరూ ఇటీవలే ఆ ఇంట్లోకి వచ్చారు. విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం గొల్లల మర్రివలస చెందిన సాకేటి రామారావు, ఆయన భార్య కళ్యాణి, కుమారుడు దుర్గాప్రసాద్‌ (17), కుమార్తె అంజలి (15) మొదటి అంతస్తులో ఉంటున్నారు. రామారావు చాక్లెట్ల మార్కెటింగ్‌ చేస్తుండగా, ఆయన భార్య ఓ ప్రైవేటు ఆసుపత్రిలో స్టాఫ్‌ నర్సుగా పనిచేస్తున్నారు. డ్రైవర్‌గా పనిచేస్తున్న సన్నపు కృష్ణ, ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా చేస్తున్న ఆయన భార్య రోజారాణి  పైఅంతస్తులో నివాసముంటున్నారు.

బుధవారం అర్ధరాత్రి దాటాక దాదాపు 1.25 గంటల సమయంలో ఈ మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. దట్టమైన దుమ్ము, ధూళి పరిసర ప్రాంతాన్ని కమ్మేసింది. ప్రమాదంలో అన్నాచెల్లెళ్లు సాకేటి దుర్గాప్రసాద్‌, అంజలి.. బిహార్‌కు చెందిన చోటూ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని స్థానికులు కాపాడారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక, పోలీసు బృందాలు సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను బయటకు తీశాయి. తీవ్రంగా గాయపడ్డ సాకేటి రామారావు, కళ్యాణి, సన్నపు కృష్ణ, రోజారాణి, శివశంకర్‌లను కేజీహెచ్‌కు  తరలించారు. భవనం నిర్మించి దాదాపు 40 ఏళ్లు కావడం, పునాది తక్కువ లోతులో ఉండటంతోనే కుప్పకూలినట్లు స్థానికులు కొందరు అధికారులకు తెలిపారు. సమీపంలోనే కొత్తగా ఓ నిర్మాణం చేపడుతున్నారని, ఇటీవల అక్కడ బోరు వేసిన సమయంలో ప్రకంపనలు వచ్చినట్లు క్షతగాత్రులు పేర్కొన్నారు.

* దుర్గాప్రసాద్‌ ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాస్తున్నాడు. అంజలి పదో తరగతి పరీక్షలకు సన్నద్ధమవుతోంది. బుధవారం అర్ధరాత్రి 12 గంటల వరకు అన్నాచెల్లెళ్లు కలిసి చదువుకున్నారు. బుధవారం దుర్గాప్రసాద్‌ పుట్టినరోజు కావడంతో ఇంట్లో కుటుంబసభ్యుల మధ్య కేకు కోసి వేడుక చేసుకున్నారు. పిల్లల మరణవార్త తల్లి కళ్యాణికి గురువారం సాయంత్రం వరకూ తెలియలేదు. ఆమె తలకు తీవ్రగాయమవడంతో శస్త్రచికిత్స చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు