సంక్షిప్త వార్తలు(4)

భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి ఆమెను అత్యంత కిరాతకంగా గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా నరికి భూమిలో పాతిపెట్టాడు.

Updated : 24 Mar 2023 06:05 IST

భార్యను చంపి.. ముక్కలుగా చేసి..

భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి ఆమెను అత్యంత కిరాతకంగా గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా నరికి భూమిలో పాతిపెట్టాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌ దక్షిణ 24 పరగణాల జిల్లాలోని బిష్ణుపుర్‌ ప్రాంతంలో వెలుగు చూసింది. ముర్షీదాబాద్‌లో నివాసముంటూ తాపీ మేస్త్రీగా పని చేస్తున్న నిందితుడు అలీమ్‌ షేక్‌కు (35) మన్వార మండలానికి చెందిన ముంతాజ్‌ షేక్‌ (35) అనే మహిళతో 20 ఏళ్ల కింద వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. వివాహానంతరం అలీమ్‌ అత్తమామలతో కలిసి బిష్ణుపుర్‌లోని చిట్‌భాగి ప్రాంతానికి నివాసం మార్చాడు. రోజులాగే మంగళవారం ఉదయం పనికి వెళ్లేందుకు ముంతాజ్‌ తన భర్త అలీమ్‌తో కలిసి బయలుదేరింది. ఆరోజు రాత్రైనా ఆమె ఇంటికి తిరిగి రాలేదు. అలీమ్‌ ఎప్పటిలాగే రాత్రి తన అత్తమామల ఇంటికి వచ్చాడు. అయితే బుధవారం ఉదయం వరకూ ముంతాజ్‌ కనిపించకపోవడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు అలీమ్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తానే భార్య ముంతాజ్‌ను హత్య చేసినట్లుగా నేరాన్ని అంగీకరించాడు.


అత్యాచార నిందితుడి హత్య

స్వీడన్‌ బాలికపై అత్యాచారం కేసులో అరెస్టయి శిక్ష అనుభవిస్తున్న నిందితుడు మహమ్మద్‌ రజా దిల్లీలో హత్యకు గురయ్యాడు. గురువారం ఉదయం మధ్య దిల్లీలోని పవార్‌గంజ్‌ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలికి చేరుకున్నారు. మృతుడు రజాతోపాటు మరో ముగ్గురు వ్యక్తులు గాయాలపాలై రక్తపు మడుగులో పడి ఉన్నారు. వారిని వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు రజా దిల్లీలోని మండవాలిలో నివాసముంటున్నాడు. అతడు ప్రస్తుతం పెరోల్‌పై బయటకు వచ్చాడు.


ఐదో తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
నిందితుల్లో పాఠశాల ప్యూన్‌

దిల్లీ: దేశరాజధానిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఐదో తరగతి విద్యార్థినిపై 54 ఏళ్ల పాఠశాల ప్యూన్‌ తన ముగ్గురు సహచరులతో కలసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. దిల్లీ పురపాలక సంస్థ నడుపుతున్న ఓ పాఠశాలలో ఈ నెల 14న చోటుచేసుకున్న ఈ దారుణం గురువారం వెలుగులోకి వచ్చింది. ప్యూన్‌ అజయ్‌ను అరెస్టు చేశామని, ఇతర నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలిని అజయ్‌ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి మత్తు మందిచ్చి సహ నిందితులతో కలసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాతి రోజు నుంచి బాలిక పాఠశాలకు రాలేదు. ఈ విషయమై క్లాస్‌ టీచర్‌ బాధితురాలి తల్లిని సంప్రదించగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.


నిద్రపోతున్నవారి పైకి దూసుకెళ్లిన బస్సు.. ఐదుగురి మృతి 

నిద్రపోతున్న యాత్రికులపైకి బస్సు దూసుకెళ్లడంతో ఐదుగురు మరణించారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరాఖండ్‌ చంపావత్‌ జిల్లాలోని పూర్ణగిరిలో గురువారం ఈ ఘోరం చోటుచేసుకుంది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్‌లో పేరుగాంచిన పూర్ణగిరి మేళాకు ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి కొందరు యాత్రికులు వచ్చారు. రాత్రి రహదారి పక్కన నిద్రపోయారు. ఆ సమయంలో ఓ బస్సును డ్రైవరు రివర్సు చేస్తుండగా వారిపైకి దూసుకెళ్లింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు