అయిదు పేర్లు... రూ.1.26 కోట్ల మోసాలు

కాగితాల్లోనే కంపెనీని స్థాపించి, కలర్‌ఫుల్‌ బ్రోచర్లను ముద్రించి, వ్యాపారం చేసేందుకు డీలర్‌షిప్‌ ఇస్తానంటూ మభ్యపెట్టి, సొమ్ము కాజేసిన అంతర్రాష్ట్ర మోసగాడు రంజిత్‌ తివారీ... తెలంగాణ సీఐడీకి చిక్కాడు.

Published : 24 Mar 2023 04:33 IST

తెలంగాణ సీఐడీకి చిక్కిన అంతర్రాష్ట్ర మోసగాడు

ఈనాడు, హైదరాబాద్‌: కాగితాల్లోనే కంపెనీని స్థాపించి, కలర్‌ఫుల్‌ బ్రోచర్లను ముద్రించి, వ్యాపారం చేసేందుకు డీలర్‌షిప్‌ ఇస్తానంటూ మభ్యపెట్టి, సొమ్ము కాజేసిన అంతర్రాష్ట్ర మోసగాడు రంజిత్‌ తివారీ... తెలంగాణ సీఐడీకి చిక్కాడు. రాష్ట్రంలోని సింధూర ట్రేడర్స్‌ యాజమాన్యాన్ని రూ.42 లక్షల మేర మోసగించిన కేసులో అతను నిందితుడు. సీఐడీ పోలీసులు హరియాణా రాష్ట్రం గురుగ్రామ్‌ జైలు నుంచి తివారీని మూడు రోజుల క్రితం పీటీవారంట్‌పై పట్టుకొచ్చారు. వివరాల్లోకి వెళ్తే... దిల్లీకి చెందిన తివారీ మెరిక్‌ బయోటెక్‌ లిమిటెడ్‌ పేరిట ఆయుర్వేద, చర్మ సంరక్షణ ఉత్పత్తుల కంపెనీని గతంలో ప్రారంభించాడు. సంస్థ పేరిట కలర్‌ఫుల్‌ బ్రోచర్లను ముద్రించాడు. ప్రాంతాలవారీగా సేల్స్‌ మేనేజర్లను నియమించుకుని ఆన్‌లైన్‌లో విస్తృతంగా ప్రచారం చేసుకున్నాడు. ఉత్తరాదిలో తమది పేరుమోసిన సంస్థ అని.. దక్షిణాదిలో రాష్ట్రాలవారీగా డీలర్లను నియమించుకుంటున్నట్లు చెప్పేవాడు. ఈ క్రమంలో 2019లో తెలంగాణకు చెందిన సింధూర ట్రేడర్స్‌ నిర్వాహకులు ఆసక్తి చూపడంతో తివారీ... ధరావత్తు కింద రూ.6 లక్షలతోపాటు ఉత్పత్తుల్ని సరఫరా చేసేందుకు రూ.36 లక్షలను తీసుకున్నారు. తర్వాత సెల్‌ఫోన్లు స్విచ్‌ఆఫ్‌ కావడంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితులు సీఐడీకి ఫిర్యాదు చేశారు. అప్పట్లోనే తివారీని పట్టుకునేందుకు ప్రయత్నించినా దొరకలేదు. ఇటీవల సీఐడీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్న మహేశ్‌ భగవత్‌ అపరిష్కృత కేసులపై దృష్టి సారించారు. ఈక్రమంలో సీఐడీ ఆర్థిక నేరాల విభాగం డీఎస్పీ ఉపేంద్రారెడ్డి నేతృత్వంలో ఎస్సై సర్దార్‌ సత్పాల్‌సింగ్‌, ఏఎస్సై అశోక్‌, కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌తో కూడిన బృందం గురుగ్రామ్‌ వెళ్లింది. తివారీ అప్పటికే అక్కడ జైల్లో ఉన్నట్లు తేలడంతో పీటీ వారంట్‌పై హైదరాబాద్‌కు పట్టుకొచ్చింది.

గురుగ్రామ్‌లోనూ మోసాలు

సీఐడీ బృందం గురుగ్రామ్‌కు వెళ్లాక తివారీ లీలలు బహిర్గతమయ్యాయి. అతను రాజీవ్‌ సక్సేనా, హిమాంశు ఉపాధ్యాయ, రంజిత్‌ అవదేశ్‌ తివారీ, రంజిత్‌కుమార్‌ తివారీ పేర్లతోనూ చలామణి అయినట్లు వెల్లడైంది. తెలంగాణాకే చెందిన యశోద ఎంపెర్సా నిర్వాహకుడు నిమ్మ నిఖిత్‌రెడ్డిని, గురుగ్రామ్‌కు చెందిన వ్యాపారి వీరేంద్రకుమార్‌ తదితరులను మోసగించి, రూ.1.26 కోట్ల వరకు కాజేసినట్లు తేలింది. వీరేంద్రకుమార్‌ ఫిర్యాదుతోనే గురుగ్రామ్‌ పోలీసులు తివారీని అరెస్ట్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని