చిలుక వాంగ్మూలంతో.. హత్యకేసు నిందితులకు జీవితఖైదు

తొమ్మిదేళ్ల క్రితం నాటి హత్యకేసులో ఓ సాక్షి ఇచ్చిన వాంగ్మూలం మేరకు నిందితురాలిని పోలీసులు విచారించారు. అనంతరం పోలీసులు సమర్పించిన చార్జిషీటు ఆధారంగా కోర్టు ఆమెను దోషిగా నిర్ధారించి జీవితఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది.

Updated : 25 Mar 2023 06:49 IST

ఆగ్రా: తొమ్మిదేళ్ల క్రితం నాటి హత్యకేసులో ఓ సాక్షి ఇచ్చిన వాంగ్మూలం మేరకు నిందితురాలిని పోలీసులు విచారించారు. అనంతరం పోలీసులు సమర్పించిన చార్జిషీటు ఆధారంగా కోర్టు ఆమెను దోషిగా నిర్ధారించి జీవితఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. పోలీసు విచారణలో సాక్షులు వాంగ్మూలం ఇవ్వడం సాధారణ విషయమే కదా.. అనుకోవచ్చు! ఈ కేసులో వాంగ్మూలం ఇచ్చిన సాక్షి.. ఓ చిలుక. అదేంటీ.. జంతువులు, పక్షుల సాక్ష్యం చెల్లదు కదా అంటారా? అయితే, చిలుక వాంగ్మూలం ఇచ్చింది కోర్టులో కాదు.. పోలీసుల విచారణలో. నిందితులను గుర్తించేందుకు ఆ చిలుకే సాయపడింది. ఆగ్రాకు చెందిన విజయ్‌శర్మ భార్య నీలమ్‌శర్మ 2014 ఫిబ్రవరి 20న ఇంట్లో హత్యకు గురయ్యారు. నిందితులు ఆమెను, వారి పెంపుడు కుక్కను పదునైన ఆయుధంతో పలుమార్లు పొడిచి దారుణంగా హత్య చేసినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైంది. ఈ కేసులో అనుమానితులుగా కొంతమందిని పోలీసులు విచారించినా.. సరైన సాక్ష్యాధారాలు దొరకలేదు. హత్య జరిగిన తర్వాతి రోజు నుంచి విజయ్‌శర్మ పెంపుడు చిలుక సరిగా తినకపోవడం, అతడి మేనకోడలు అషు ఇంటికి వచ్చిన ప్రతిసారీ ఆమెను చూసి అరుస్తుండటం చేసేది. దీంతో హత్య చేసినవారిని చిలుక చూసి ఉంటుందనే అనుమానంతో విజయ్‌శర్మ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ కేసులో గతంలో విచారించిన అనుమానితులతోపాటు అషును కూడా పోలీసులు చిలుక ముందు నిలబెట్టారు. అప్పుడు కూడా చిలుక అషును చూసి అరుస్తుండటంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది. రోన్నీ అనే వ్యక్తితో కలిసి నీలమ్‌శర్మను నగలు, డబ్బు కోసం తానే హత్య చేసినట్లు అషు అంగీకరించింది. పోలీసులు చార్జిషీట్‌లో చిలుక వాంగ్మూలం గురించి ప్రస్తావించినప్పటికీ.. దాన్ని సాక్షిగా కోర్టులో ప్రవేశపెట్టలేదు. హత్య జరిగిన ఆరు నెలల తర్వాత చిలుక చనిపోయింది. తాజాగా ఈ కేసులో ప్రత్యేక న్యాయస్థానం జడ్జి దోషులిద్దరికీ జీవితఖైదు విధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని