కారులో కాపలాదారు సజీవదహనం!

దోమల నివారణకు వెలిగించిన మస్కిటోకాయిల్‌ అంటుకొని ఓ కాపలాదారు కారులోనే సజీవదహనమయ్యాడు.

Published : 26 Mar 2023 04:25 IST

సీటుకు మస్కిటో కాయిల్‌ అంటుకొని అగ్నిప్రమాదం

అబిడ్స్‌, న్యూస్‌టుడే: దోమల నివారణకు వెలిగించిన మస్కిటోకాయిల్‌ అంటుకొని ఓ కాపలాదారు కారులోనే సజీవదహనమయ్యాడు. హృదయవిదారకమైన ఈ ఘటన శనివారం తెల్లవారుజామున అబిడ్స్‌లోని బొగ్గులకుంటలో జరిగింది. అబిడ్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రసాద్‌రావు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. బొగ్గులకుంట కామినేని ఆసుపత్రి సమీపంలోని వినాయక ఆటో గ్యారేజీలో వినయ్‌కుమార్‌, రాజు కారు షెడ్డు నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాత్రి కార్వాన్‌కు చెందిన సంతోష్‌ (42) గ్యారేజీలో కాపలా విధులకు వచ్చాడు. ఇతడు ఆరు నెలల క్రితమే ఇక్కడ ఉద్యోగంలో చేరాడు. అతడు అర్ధరాత్రి దాటాక షెడ్‌లోని బెంజ్‌ కారు తలుపులు తీసి వెనుక సీట్లో నిద్రకు ఉపక్రమించాడు. దోమల నివారణకు ముందు సీట్లో మస్కిటో కాయిల్‌ వెలిగించాడు. కాయిల్‌లోని నిప్పు కారు సీటుకు అంటుకొని నెమ్మదిగా పొగ అలుముకుంది. క్రమేణా మంటలు వ్యాపించడంతో నిద్ర నుంచి మేలుకొన్న సంతోష్‌ బయటపడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించక.. కారులోనే మరణించాడు. తెల్లవారుజాము సమయంలో బెంజ్‌ కారు నుంచి చెలరేగిన మంటలు ఇతర వాహనాలకు అంటుకోవడం చూసిన కామినేని ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఇన్‌స్పెక్టర్‌ ప్రసాద్‌రావు సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. అగ్నిమాపక, డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో మూడు కార్లు పూర్తిగా దగ్ధమవగా.. మరో నాలుగు కార్లు పాక్షికంగా కాలిపోయాయి. బెంజ్‌ కారులో సంతోష్‌ మృతదేహం కనిపించాకే ప్రమాదానికి కారణమేమిటన్నది పోలీసులకు అర్థమైంది. కారు తలుపు దగ్గర అతడి చేయి ఉండటంతో బయటపడేందుకు చివరివరకు ప్రయత్నించినట్లు భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని