డేటా చౌర్యం.. రంగంలోకి ఆర్మీ

సంచలనం సృష్టించిన 16.8 కోట్ల మంది ప్రజల వ్యక్తిగత డేటా చౌర్యం కేసు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.

Updated : 26 Mar 2023 10:55 IST

సైబరాబాద్‌ పోలీసులతో రక్షణ రంగ ఉన్నతాధికారుల భేటీ
2.55 లక్షల మంది తమ ఉద్యోగుల వివరాలు ఉండటంపై ఆరా

ఈనాడు, హైదరాబాద్‌: సంచలనం సృష్టించిన 16.8 కోట్ల మంది ప్రజల వ్యక్తిగత డేటా చౌర్యం కేసు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో అరెస్టయిన నిందితుల దగ్గర రక్షణ రంగానికి చెందిన ఉద్యోగుల సమాచారం లభ్యమవ్వడం.. ఇది జాతీయ భద్రతకు ముప్పు కావడంతో ఆర్మీ దీనిపై దృష్టి సారించింది. దిల్లీ, హైదరాబాద్‌కు చెందిన ఆర్మీ ఉన్నతాధికారులు సైబరాబాద్‌ పోలీసులతో భేటీ అయ్యారు. నిందితుల వద్ద జాతీయ రాజధాని పరిధి(ఎన్‌సీఆర్‌)లో పనిచేసే 2.55 లక్షల మంది రక్షణశాఖ ఉద్యోగుల డేటా లభ్యమైంది. దీంతో రక్షణశాఖ ఉన్నతాధికారులు పలు అంశాలపై పోలీసులతో చర్చించారు. ఉద్యోగుల డేటా నకలు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలు ఏవిభాగంలో నమోదు చేస్తారో గుర్తిస్తామని చెప్పినట్లు అధికారులు తెలిపారు. డేటా లీకేజీ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు సైబరాబాద్‌ పోలీసులు వివిధ బ్యాంకులు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, సామాజిక మాధ్యమాలు, వివిధ బోర్డులకు నోటీసులిచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అరెస్టయిన ఏడుగురు నిందితులు తమ దగ్గరున్న డేటాను 138 విభాగాలుగా విభజించి అంగట్లో అమ్మేస్తున్నారు. జస్ట్‌ డయల్‌లో డేటా ప్రొవైడర్ల పేరుతో పేర్లు నమోదు చేసుకుని సంప్రదించిన వారికి డేటా అమ్ముతున్నారు. జస్ట్‌ డయల్‌ను కేసులో భాగంగా విచారించనున్నారు. ఈ సమాచారానికి మూలాధారమైన వ్యవస్థలను గుర్తించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ద్వారా నోటీసులిచ్చి విచారించనున్నట్లు ఉన్నతాధికారి తెలిపారు.

ముంబయి వ్యక్తి నుంచి డేటా కొనుగోలు!

నిందితులు కోట్ల మంది డేటా ఏమార్గంలో సంపాదించారన్న అంశంపై సైబరాబాద్‌ క్రైమ్స్‌ డీసీపీ కల్మేశ్వర్‌ సింగేనవార్‌ నేతృత్వంలోని సిట్‌ దృష్టిపెట్టింది. ఈ కేసులో అరెస్టయిన నిందితుల్లో ఒకడైన నాగ్‌పుర్‌కు చెందిన జియా ఉర్‌ రెహ్మాన్‌ మిగిలిన ఆరుగురికి డేటా అమ్మాడు. ముంబయికి చెందిన ఒక వ్యక్తి నుంచి డేటా కొనుగోలు చేశామని ఇతను పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో గొలుసుకట్టు తరహాలో అనేకమంది ఉన్నారని, మరింతమంది కేసులో నిందితులుగా చేరే అవకాశముందని ఉన్నతాధికారి చెప్పారు.

ఎక్కువ డేటా ఉత్తరాది ప్రజలదే

నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న డేటాను సైబరాబాద్‌లోని తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఫర్‌ సైబర్‌ సేఫ్టీ(టీఎస్‌పీసీసీ) ద్వారా విశ్లేషిస్తున్నారు. నిందితుల దగ్గర ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాల ప్రజల డేటా ఉన్నట్లు గుర్తించారు. బ్యాంకు డెబిట్‌, క్రెడిట్‌ ఖాతాదారులకు సంబంధించి హైదరాబాద్‌, తెలంగాణలోని కొన్ని జిల్లాల ప్రజల డేటా ఉంది. హైదరాబాదీల డేటాకు సంబంధించి నగరానికి చెందిన ఒక వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుంటామని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని