సిట్‌ అదుపులో మరో ముగ్గురు!

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో రోజురోజుకూ కొత్త పేర్లు బయటకు వస్తున్నాయి. ఓ వైపు గ్రూప్‌-1 ప్రిలిమినరీ ప్రశ్నపత్రాలు ఎవరెవరి చేతికి చేరాయో దర్యాప్తు చేస్తూనే.. ఏఈ ప్రశ్నపత్రంపైనా సిట్‌ అధికారులు దృష్టి సారించారు.

Updated : 26 Mar 2023 05:32 IST

లీకేజీ వ్యవహారంలో మరికొందరి పాత్ర వెలుగులోకి

ఈనాడు, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో రోజురోజుకూ కొత్త పేర్లు బయటకు వస్తున్నాయి. ఓ వైపు గ్రూప్‌-1 ప్రిలిమినరీ ప్రశ్నపత్రాలు ఎవరెవరి చేతికి చేరాయో దర్యాప్తు చేస్తూనే.. ఏఈ ప్రశ్నపత్రంపైనా సిట్‌ అధికారులు దృష్టి సారించారు. రేణుక దంపతుల ద్వారా ఇప్పటివరకు ఆరుగురు వ్యక్తులకు ఈ ప్రశ్నపత్రాలు చేరినట్టు గుర్తించారు. వీరిలో ప్రశాంత్‌రెడ్డి అనే వ్యక్తిని శుక్రవారం మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబుపేటలో అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి రాబట్టిన సమాచారంతో శనివారం మరో ముగ్గురిని సిట్‌ అదుపులో తీసుకున్నట్టు సమాచారం. ప్రశ్నపత్రాల లీకేజీతో సంబంధాలున్నట్టు ఆధారాలు లభించగానే ఈ నలుగురినీ అరెస్ట్‌ చేయనున్నారు. అజ్ఞాతంలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. గ్రూప్‌-1లో 100కు పైగా మార్కులు తెచ్చుకున్న 121 మందిలో శుక్రవారం వరకు 40 మందిని విచారించారు. మిగిలిన 81 మందిలో మరికొందరిని సిట్‌ అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది.

ఇద్దరు ప్రశాంత్‌లు..

తన చేతికి వచ్చిన గ్రూప్‌-1 ప్రశ్నపత్రంతో న్యూజిలాండ్‌లో ఉంటున్న తన బావ ప్రశాంత్‌ను నగరానికి రప్పించి పరీక్ష రాయించాడు రాజశేఖర్‌రెడ్డి. దర్యాప్తులో ప్రశాంత్‌ పేరు బయటకు రాగానే అతడికి సిట్‌ పోలీసులు సమాచారం పంపారు. తమ ఎదుట హాజరు కావాలని చెప్పారు. అతడినుంచి స్పందన రాకపోతే లుక్‌ఔట్‌ నోటీసులు జారీ చేస్తామనీ పేర్కొన్నారు. గోపాల్‌నాయక్‌, నీలేష్‌నాయక్‌లకు రేణుక దంపతులు రూ.13.50లక్షలకు ప్రశ్నపత్రం విక్రయించారు. కర్మన్‌ఘాట్‌లోని ఓ లాడ్జీలో ఆ ఇద్దరినీ ఉంచి శిక్షణ ఇచ్చి పరీక్ష రాయించారు.

మరోసారి పోలీసు కస్టడీకి నలుగురు నిందితులు

ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో నలుగురు నిందితులను పోలీసులు మరోసారి కస్టడీకి తీసుకోనున్నారు. ఈ వ్యవహారంలో మొత్తం 12 మంది అరెస్టయిన సంగతి తెలిసిందే. వీరిలో 9 మందిని ఇటీవల సిట్‌ పోలీసులు 6 రోజులు కస్టడీకి తీసుకుని ప్రశ్నించారు. విచారణలో కీలక వివరాలు రాబట్టారు. కస్టడీ ముగియడంతో రిమాండ్‌కు తరలించారు. వీరిలో ప్రధాన నిందితుడు ప్రవీణ్‌కుమార్‌, రాజశేఖర్‌రెడ్డి, డాక్యానాయక్‌, రాజేందర్‌నాయక్‌లను మరోసారి 6 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిట్‌ పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. 3 రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతిచ్చింది. ఆదివారం నుంచి మంగళవారం వరకూ ఈ నలుగురిని విచారించనున్నారు. లీకైన ప్రశ్నపత్రాలతో పరీక్ష రాసి 100కు పైగా మార్కులు సాధించిన రమేశ్‌కుమార్‌, షమీమ్‌, సురేష్‌లను ఈ నెల 22న సిట్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరిని కూడా 7 రోజులు కస్టడీకి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు