తెదేపా నాయకుడి హత్య

తూర్పుగోదావరి జిల్లాలో తెదేపా నాయకుడు హత్యకు గురయ్యారు. కొవ్వూరు మండలం వేములూరు, నందమూరు తెదేపా యూనిట్‌ ఇన్‌ఛార్జి, వేములూరు ఉప సర్పంచి శీని సత్య వరప్రసాద్‌ (51) ఆదివారం ఉదయం ఇంటి వరండాలో విగతజీవిగా పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు.

Published : 27 Mar 2023 02:17 IST

తూర్పుగోదావరి జిల్లా వేములూరులో ఘటన
ఇంటి వరండాలో మృతదేహం
హతుడి భార్య ఫిర్యాదుతో హత్య కేసు నమోదు

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే: తూర్పుగోదావరి జిల్లాలో తెదేపా నాయకుడు హత్యకు గురయ్యారు. కొవ్వూరు మండలం వేములూరు, నందమూరు తెదేపా యూనిట్‌ ఇన్‌ఛార్జి, వేములూరు ఉప సర్పంచి శీని సత్య వరప్రసాద్‌ (51) ఆదివారం ఉదయం ఇంటి వరండాలో విగతజీవిగా పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. మృతదేహంపై గాయాలు, రక్తపు మరకలు ఉండటంతో ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. సత్య వరప్రసాద్‌ భార్య శ్రీకళ ఉద్యోగం నిమిత్తం జంగారెడ్డిగూడెంలో ఉంటున్నారు. కుమార్తె ఏలూరులో, కుమారుడు రాజమహేంద్రవరంలో ఉంటూ చదువుకుంటున్నారు. సత్య వరప్రసాద్‌ ఒక్కరే వేములూరులోని సొంత ఇంట్లో ఉంటున్నారు. శనివారం రాత్రి 10 గంటల వరకు చుట్టుపక్కల వారితో మాట్లాడారు. ఆదివారం స్థానికులు రావిపాటి వెంకట్రావు, తిరుమరెడ్డి ఆంజనేయులు ఆయన ఇంటికి వెళ్లారు. వరండాలో దుప్పటి కప్పుకొని ఉండటంతో పడుకున్నారని భావించారు. పిలిచినా ఎంతకూ పలకకపోవడంతో వెళ్లి దుప్పటి తీయగా.. గాయాలతో సత్య వరప్రసాద్‌ మృతదేహం కనిపించింది. బోర్లా పడి ఉన్న మృతదేహంపై దుస్తుల్లేవు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పట్టణ సీఐ రవికుమార్‌, ఎస్సై దుర్గాప్రసాద్‌ వచ్చి ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఎడమ దవడపై గాయం, ఎడమ చెవి నుంచి రక్తస్రావం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. గదిలో గొడవ పడి, వరండాలోకి తీసుకొచ్చి తలను గోడకేసి కొట్టి హత్య చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. మృతదేహాన్ని కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శ్రీకళ ఫిర్యాదుపై హత్యకేసు నమోదు చేశారు.

వివాద రహితుడిగా పేరు..

తమ కంటే ఊరికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చేవారని, ఎందుకిలా జరిగిందో తెలియదని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. శనివారం రాత్రి 11 గంటలకు తమతో మాట్లాడారని పిల్లలు ఆవేదన చెందారు. అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత ఇంట్లో నుంచి అరుపులు వినిపించాయని స్థానికులు కొందరు తెలిపారు. వివాద రహితుడిగా, పార్టీలకు అతీతంగా సత్య వరప్రసాద్‌కు మంచి పేరుందన్నారు. పంచాయతీ నిధుల వినియోగంలో అవినీతి జరిగిందని తోటి సభ్యులతో కలిసి పలు సందర్భాల్లో బహిరంగంగానే పోరాటం చేశారని గుర్తు చేసుకున్నారు. అంతకుమించి రాజకీయంగా వివాదాల్లేవని తెలిపారు. కుటుంబ ఆస్తి తగాదాలు, ఇతర కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ వర్మ తెలిపారు.

* హత్యపై సమగ్ర దర్యాప్తు చేయాలని, హోం మంత్రి  ఇలాకాలో శాంతి, భద్రతలు క్షీణించాయని మాజీ మంత్రి  జవహర్‌ ఆరోపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు