Crime News: పశుసంవర్ధక శాఖ డీడీ అచ్చెన్న హత్య కేసులో ముగ్గురి అరెస్టు: ఎస్పీ

దళిత ఉద్యోగి, పశుసంవర్ధకశాఖ ఉపసంచాలకుడు డాక్టర్‌ చిన్న అచ్చెన్న (58) హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.

Updated : 27 Mar 2023 14:57 IST

కడప :  దళిత ఉద్యోగి, పశుసంవర్ధకశాఖ ఉపసంచాలకుడు డాక్టర్‌ చిన్న అచ్చెన్న (58) హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ చెప్పారు. మీడియా సమావేశంలో ఎస్పీ ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఏడీ సుభాష్‌ చంద్రబోస్‌, కలసపాడుకు చెందిన చెన్న కృష్ణ, గుర్రంకొండకు చెందిన బాలాజీ నాయక్‌ను అరెస్టు చేసినట్లు చెప్పారు.

‘చంద్రబోస్‌ మరో ఇద్దరితో కలిసి ఈ హత్యకు ప్రణాళిక రచించాడు. జీతం రాకుండా చేసి.. ప్రభుత్వానికి సరెండర్‌ చేశారన్న కక్షతో చంద్రబోస్‌ ఈ హత్యకు ప్లాన్‌ చేశాడు. పోరుమామిళ్లలోని లాడ్జిలో ఈ నెల 11న హత్యకు పథక రచన చేశారు. 12న అచ్చెన్న చర్చిలో ప్రార్థన చేసి వస్తుండగా కిడ్నాప్‌ చేశారు. గువ్వల చెరువు ఘాట్‌ వరకూ కారులోనే అచ్చెన్నను కొట్టుకుంటూ తీసుకెళ్లారు. అనంతరం ఘాట్‌ వద్దే అచ్చెన్నను చంపారు. అచ్చెన్న సెల్‌ తీసుకొని సికె దిన్నె పరిధిలోని కొండల్లో పడేశారు. ఫొన్‌ కాల్‌డేటా ఆధారంగా నిందితులను గుర్తించాం. కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారన్న దానిపై దర్యాప్తు చేస్తున్నాం’ అని ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు.

నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తే ఉద్యమిస్తాం: మందకృష్ణ

చిన్న అచ్చెన్న హత్య కేసును సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్‌ చేశారు. కడప పోలీసులకు ఫిర్యాదు చేసినా 12 రోజులు స్పందించలేదన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో ఒక్కరినీ పోలీసులు విచారించలేదని మండిపడ్డారు. మృతదేహం లభ్యమయ్యాకే పోలీసులు హత్య కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారని విమర్శించారు. నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని