Cyber Crime : ఇంట్లో కూర్చోబెట్టే కాజేత

అబిడ్స్‌కు చెందిన యువతి బీటెక్‌ పూర్తిచేశారు. ఉద్యోగ వేటలో ఉండగా మొబైల్‌ ఫోన్‌కు ఓ సందేశం వచ్చింది. ఇంటి వద్ద ఉంటూనే ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులకు ప్రచారం చేస్తూ రోజూకు రూ.700-900 సంపాదించొచ్చంటూ ఆశ చూపారు.

Published : 28 Mar 2023 07:38 IST

మహిళలే లక్ష్యంగా సైబర్‌ నేరగాళ్ల ఎత్తులు
ఈనాడు, హైదరాబాద్‌

బిడ్స్‌కు చెందిన యువతి బీటెక్‌ పూర్తిచేశారు. ఉద్యోగ వేటలో ఉండగా మొబైల్‌ ఫోన్‌కు ఓ సందేశం వచ్చింది. ఇంటి వద్ద ఉంటూనే ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులకు ప్రచారం చేస్తూ రోజూకు రూ.700-900 సంపాదించొచ్చంటూ ఆశ చూపారు. రూ.2,000 రిజిస్ట్రేషన్‌ ఫీజు కట్టించుకున్నారు. నెల తర్వాత డిజిటల్‌ ఖాతాలో రూ.28వేల ఆదాయం చూపారు. ఆ సొమ్ము విత్‌డ్రా చేసుకునేందుకు అదనంగా రూ.50 వేలు డిపాజిట్‌ చేయాలన్నారు. సంపాదన పెరుగుతున్న కొద్దీ డిపాజిట్‌ పెంచుతూ వచ్చారు. రూ.5 లక్షలు డిపాజిట్‌ చేయించుకొని ఖాతా రద్దు చేశారు.

‘‘కేవలం 10-30 నిమిషాలు కేటాయించండి. రోజు రూ.200-300 వరకూ సంపాదించండి. మొబైల్‌ ఫోన్‌ మీ చేతిలో ఉందా! ఎందుకు ఆలస్యం’’ అంటూ గృహిణులు, యువతులను సైబర్‌ మాయగాళ్లు మోసం చేస్తున్నారు. పార్ట్‌టైం ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ ఆశల వల విసురుతున్నారు. నగరంలో సైబర్‌ క్రైమ్‌కు వస్తున్న ఫిర్యాదుల్లో అధిక శాతం ఉద్యోగం, పెట్టుబడులకు సంబంధించిన మోసాలే ఉంటున్నాయి. బాధితుల్లో విద్యార్థినులు, ఉన్నత విద్యావంతులు, గృహిణులు ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఖాళీ సమయాల్లో 2-3 గంటలు కష్టపడితే చాలనే ఉద్దేశంతో బాధితులు అవతలి వారి మాటలను నమ్ముతూ ఉచ్చులో చిక్కుతున్నారు.

సంపాదన.. పెట్టుబడి అంటూ

గతంలోదీపపు వత్తులు, కరక్కాయ పొడి, గ్రంథాలను పీడీఎఫ్‌గా మార్చి రూ.లక్షలు సంపాదించమంటూ సామాజిక మాధ్యమాల వేదికగా మోసగాళ్లు చెలరేగారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌ వేదికగా పార్ట్‌టైమ్‌ ఉద్యోగాల పేరిట మోసాలకు తెరలేపారు. ఉద్యోగ వేటలో ఉన్న యువతులు తేలికగా బుట్టలో పడుతున్నారు. ఆన్‌లైన్‌లో కొలువు నిర్వర్తిస్తూ.. అదే కంపెనీలో పెట్టుబడితో రెండు చేతులా సంపాదనంటూ ప్రకటనలతో ఆకట్టుకుంటున్నారు. స్నేహితులు, బంధువులను సభ్యులుగా చేర్పించి.. మరింత లాభపడమంటూ మోసగాళ్ల సూచనతో తెలిసినవారితో పెట్టుబడి పెట్టిస్తున్నారు.


అటువంటి ప్రకటనలు నమ్మొద్దు
- నేహా మెహ్రా, డీసీపీ, సైబర్‌క్రైమ్‌ హైదరాబాద్‌

బాధితుల్లో కేవలం మహిళలు, యువతులే కాదు.. అన్ని వర్గాల వారున్నారు. ఇంట్లో ఉంటూ సంపాదించే అవకాశం ఉందనగానే తేలికగా నమ్మేస్తున్నారు. సామాజిక మాధ్యమాలు, ఫోన్లకు వచ్చే ఇటువంటి ప్రకటనలు నమ్మొద్దు. వాస్తవాలు తెలియకుండా పెట్టుబడి పెట్టొద్దు. మోసపోతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని