Vizag: మేం వెళ్లిపోతున్నాం... మా పిల్లలు జాగ్రత్త!

‘మేమిద్దరమూ వెళ్లిపోతున్నాం. మా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. వాళ్లను ఎవరూ ఏమీ అనొద్దు.

Updated : 29 Mar 2023 07:39 IST

ఆత్మహత్య చేసుకుంటామని దంపతుల సెల్ఫీ వీడియో  
ఆచూకీ కోసం గాలింపు

విశాఖపట్నం(కూర్మన్నపాలెం), న్యూస్‌టుడే : ‘మేమిద్దరమూ వెళ్లిపోతున్నాం. మా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. వాళ్లను ఎవరూ ఏమీ అనొద్దు. ఒకవేళ ఎవరైనా ఏమన్నా అన్నా... పిల్లలూ పట్టించుకోకండి’ అని సెల్ఫీ వీడియో తీసుకున్న దంపతులు దాన్ని బంధువులకు పంపి, వారు కనిపించకుండా పోయారు. ఈ ఘటన విశాఖపట్నంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. విశాఖ ఉక్కు కర్మాగారం ఎస్‌ఎంఎస్‌-2 విభాగంలో పని చేస్తున్న చిత్రాడ వరప్రసాద్‌ (47), మీరా(41) దంపతులు 87వ వార్డు తిరుమలనగర్‌ సమీపంలోని శివాజీనగర్‌లో ఉంటున్నారు. వీరికి కుమారుడు కృష్ణసాయితేజ, కుమార్తె దివ్యలక్ష్మి ఉన్నారు. కుమార్తెకు గతేడాది  వివాహమైంది. కుమారుడు బ్యాటరీ దుకాణం నిర్వహిస్తున్నారు. వరప్రసాద్‌, మీరా ఆత్మహత్య చేసుకుంటున్నామని విలపిస్తూ సెల్ఫీ వీడియో తీసుకొని, దాన్ని సోమవారం సాయంత్రం బంధువులకు పంపారు. ఆ తర్వాత ఫోన్‌ను స్విచ్ఛాఫ్‌ చేసి ఎటో వెళ్లిపోయారు. దీనిపై కృష్ణసాయితేజ దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దంపతుల ఫోన్‌ సిగ్నల్‌ చివరిసారిగా అనకాపల్లి సమీపంలోని కొప్పాక ఏలేరు కాలువ వద్ద చూపించిందని, వెళ్లి చూశారు. కాలువ గట్టున వారి చెప్పులు, చేతి సంచి, ఇతర వస్తువులు గుర్తించారు. మంగళవారం ఉదయం గజ ఈతగాళ్లతో కాలువలో గాలించారు. రాత్రి వరకూ ఆచూకీ లభించలేదు. వరప్రసాద్‌ అధిక వడ్డీలకు అప్పులు చేయడంతో ఇటీవల రుణదాతల నుంచి ఒత్తిళ్లు పెరిగాయని స్థానికులు చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని