Pulivendula: పులివెందులలో నడిరోడ్డుపై కాల్పులు

సీఎం జగన్‌ సొంత నియోజకవర్గమైన పులివెందులలో పట్టపగలు... నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే గొర్లె భరత్‌కుమార్‌ యాదవ్‌ అనే వ్యక్తి తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు.

Updated : 29 Mar 2023 09:56 IST

ఒకరి మృతి.. మరొకరికి గాయాలు
నిందితుడు వివేకా హత్య కేసులో విచారణ ఎదుర్కొన్న గొర్లె భరత్‌కుమార్‌ యాదవ్‌
అప్రూవర్‌ దస్తగిరిని ప్రలోభపెట్టేందుకు యత్నించారనే అభియోగం

ఈనాడు డిజిటల్‌-కడప, న్యూస్‌టుడే-పులివెందుల: సీఎం జగన్‌ సొంత నియోజకవర్గమైన పులివెందులలో పట్టపగలు... నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే గొర్లె భరత్‌కుమార్‌ యాదవ్‌ అనే వ్యక్తి తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. భరత్‌కుమార్‌ యాదవ్‌.. వివేకా హత్యకేసులో అప్రూవర్‌గా మారిన షేక్‌ దస్తగిరిని వాస్తవాలు వెల్లడించకుండా ప్రలోభపెట్టేందుకు యత్నించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కాల్పుల్లో పులివెందులకు చెందిన చింతకుంట దిలీప్‌ (30) మరణించగా, ఆయన సమీప బంధువైన మహబూబ్‌ బాషా తీవ్రంగా గాయపడ్డారు. మట్కా నిర్వహణ వ్యవహారమే ఈ ఘటనకు కారణమన్న ఆరోపణలున్నాయి. పోలీసులు మాత్రం వ్యక్తిగత కక్షలు, ఆర్థిక లావాదేవీల వివాదాలే కారణమని చెబుతున్నారు. నిందితుడు లైసెన్సుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. వివరాల్లోకి వెళితే.. భరత్‌యాదవ్‌, దిలీప్‌ కొంతకాలంగా ఆర్థిక వివాదాలతో ఘర్షణ పడుతున్నారు. సోమవారం సాయంత్రం పులివెందుల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో వీరిమధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. భరత్‌యాదవ్‌ తన తుపాకీతో తొలుత దిలీప్‌పై విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. అడ్డుకునేందుకు యత్నించిన మహబూబ్‌ బాషానూ కాల్చాడు. అనంతరం కింద పడిపోయిన బుల్లెట్‌ షెల్స్‌ను ఏరుకుని ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. కాల్పులు శబ్దం ధాటికి అక్కడున్న జనం భయపడి పారిపోయారు. తీవ్ర గాయాలపాలైన దిలీప్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగానే ప్రాణాలు కోల్పోయారు. మహబూబ్‌ బాషాను కడప రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. భరత్‌కుమార్‌ యాదవ్‌ స్థానికంగా ఓ దినపత్రిక విలేకరిగా, యూట్యూబర్‌గా పనిచేస్తున్నారు. రెండేళ్ల కిందట భరత్‌యాదవ్‌ వద్ద దిలీప్‌ రూ.50వేల అప్పు తీసుకున్నారు. దీనికి నెలవారీ వడ్డీ చెల్లిస్తున్నారు. గొడవకు.. అసలు చెల్లింపు వ్యవహారం ఒక కారణంగా భావిస్తున్నారు.

తుపాకీతో బెదిరింపులు

పులివెందుల కొత్త బస్టాండు ఎదురుగా భరత్‌కుమార్‌ యాదవ్‌కు టిఫిన్‌ దుకాణం ఉంది. దాని పక్కనే ఆర్‌.తుమ్మలపల్లె గ్రామవాసి ప్రసాద్‌రెడ్డికి చెందిన భవనం ఉంది. దాని ప్రహరీ విషయమై నెలరోజుల కిందట ఘర్షణ చోటుచేసుకోగా.. భరత్‌కుమార్‌ యాదవ్‌ తుపాకీతో కాల్చేందుకు యత్నించారు. ప్రసాద్‌రెడ్డి సోదరుడు విశ్వనాథ్‌రెడ్డి.. భరత్‌యాదవ్‌ చేతిలో తుపాకీ లాక్కొని అతన్ని నిలువరించారు. ఈ వ్యవహారం పోలీసుల దృష్టికి వెళ్లినా చర్యలేవీ తీసుకోలేదన్న ఆరోపణలున్నాయి. నకిలీ పత్రాలతో భూములు లాక్కొనేందుకు యత్నించగా గుంతబజారుకు చెందిన కొందరు భరత్‌యాదవ్‌పై తిరగబడ్డారు. లైసెన్సుడు తుపాకీతో బెదిరింపులు, సెటిల్‌మెంట్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి.

వివేకా హత్య కేసులో విచారణ

మాజీమంత్రి వివేకా హత్యకేసులో భరత్‌కుమార్‌ యాదవ్‌ను సీబీఐ గతంలో విచారించింది. ఈ కేసులో రెండో నిందితుడైన సునీల్‌యాదవ్‌కు.. భరత్‌ సమీప బంధువు. వివేకా హత్యకు కొన్ని గంటల ముందు సునీల్‌యాదవ్‌కు... భరత్‌ యాదవ్‌ మద్యం సరఫరా చేశారన్న ఆరోపణలున్నాయి. వివేకా హత్యకేసులో నిందితుడైన ఎర్ర గంగిరెడ్డిని గతంలో పోలీసులు అరెస్టుచేసి.. వేముల పోలీసుస్టేషన్‌లో ఉంచారు. ఈ సమయంలో అక్కడికి వెళ్లిన భరత్‌కుమార్‌ యాదవ్‌ హత్యకు సంబంధించిన పలు విషయాలను బహిరంగంగా ప్రస్తావించినట్లు సమాచారం.

వ్యక్తిగత కక్షలే కారణం: ఎస్పీ

భరత్‌కుమార్‌ యాదవ్‌ వ్యక్తిగత కక్షతోనే దిలీప్‌, మహబూబ్‌బాషాలపై కాల్పులు జరిపినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. సాయంత్రం ఆయన ఘటనా స్థలానికి వచ్చారు. డీఎస్పీ శ్రీనివాసులు, పోలీసులను ఆరాతీశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... భరత్‌కుమార్‌ యాదవ్‌, దిలీప్‌ల మధ్య ఆర్థిక లావాదేవీల కారణంగా ఏడాది నుంచి వివాదం నడుస్తోందన్నారు. డబ్బులు అడిగేందుకు వెళ్లగా వారు ఘర్షణ పడ్డారన్నారు. తరువాత ఇంటికి వెళ్లి రివాల్వర్‌ తీసుకొచ్చి దిలీప్‌, మహబూబ్‌బాషాలపై మూడుసార్లు కాల్పులు జరిపారన్నారు. నిందితుడు భరత్‌కుమార్‌ యాదవ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. గతంలో ప్రాణహాని ఉందని మీడియా ఎదుట ప్రస్తావించడం, వివేకా హత్యకేసు విచారిస్తున్న సీబీఐ బృందానికి లేఖ రాయడంతోనే ఆయనకు రివాల్వరు మంజూరు చేశామని తెలిపారు. ఈ విషయంపై సామాజిక మాధ్యమాల్లో వేరేలా ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని