పొలాన్ని ఆక్రమించారంటూ మహిళ ఆత్మహత్యాయత్నం

పూర్వీకుల నుంచి సంక్రమించిన పొలాన్ని ఇతరులు రిజిస్టర్‌ చేయించుకుని అన్యాయం చేశారంటూ ఓ మహిళా రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన పల్నాడు జిల్లా అచ్చంపేట తహసీల్దారు కార్యాలయం వద్ద మంగళవారం జరిగింది.

Published : 29 Mar 2023 05:43 IST

అచ్చంపేట తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఘటన

అచ్చంపేట, న్యూస్‌టుడే: పూర్వీకుల నుంచి సంక్రమించిన పొలాన్ని ఇతరులు రిజిస్టర్‌ చేయించుకుని అన్యాయం చేశారంటూ ఓ మహిళా రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన పల్నాడు జిల్లా అచ్చంపేట తహసీల్దారు కార్యాలయం వద్ద మంగళవారం జరిగింది. బాధితుల వివరాల మేరకు.. అచ్చంపేట మండలం కోగంటివారిపాలెం చెందిన పల్లప్రోలు శ్రీనివాసరెడ్డి, సంపూర్ణమ్మ దంపతులకు చామర్రు రెవెన్యూ పరిధిలో వేర్వేరు సర్వే నంబర్లలో పూర్వీకుల నుంచి సంక్రమించిన 2.78 ఎకరాల పొలం ఉంది. వారికి తెలియకుండా బంధువులు కొందరు ఆ పొలాన్ని ఇతరులకు రిజిస్టర్‌ చేయించారు. పాసు పుస్తకాలు పొందారు. ఈ విషయం తెలిసిన బాధితులు.. పొలాన్ని కొన్నేళ్లుగా తామే సాగు చేసుకుంటున్నామని, న్యాయం చేయాలని స్థానిక రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. న్యాయస్థానంలోనూ కేసు వేశారు. అయినా రిజిస్టర్‌ చేయించుకున్నవారు బెదిరించి పొలాన్ని దున్నేందుకు ఇటీవల ప్రయత్నించారు. దీంతో మనస్తాపానికి గురైన సంపూర్ణమ్మ మంగళవారం తహసీల్దారు కార్యాలయం వద్ద పురుగుమందు తాగింది. ఈ విషయమై తహసీల్దార్‌ పద్మాదేవి మాట్లాడుతూ.. శ్రీనివాసరెడ్డి వద్ద పొలానికి సంబంధించి ఎలాంటి పత్రాలు లేవని, రిజిస్ట్రేషన్‌ పత్రాలు ఉన్న వారికి పాసు పుస్తకాలు జారీ చేశామన్నారు. ఈ పొలంలో 50 సెంట్ల ఆక్రమణ భూమి ఉందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని