బీమా చేయించి తండ్రి హత్య!

బీమా డబ్బు కోసం కన్నతండ్రినే హత్య చేసి.. రోడ్డు ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం చేశాడో కుమారుడు. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌లో మంగళవారం ఈ దారుణం జరిగింది.

Updated : 29 Mar 2023 06:11 IST

కొడంగల్‌, బొంరాస్‌పేట, న్యూస్‌టుడే: బీమా డబ్బు కోసం కన్నతండ్రినే హత్య చేసి.. రోడ్డు ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం చేశాడో కుమారుడు. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌లో మంగళవారం ఈ దారుణం జరిగింది. ఎస్సై రవి కథనం ప్రకారం... బొంరాస్‌పేట మండలంలోని బిక్యానాయక్‌తండాకు చెందిన రాథోడ్‌ ధన్‌సింగ్‌ (68)కు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు తాండూరులో ఉంటున్నాడు. ఇద్దరు కుమారులు రవినాయక్‌, శ్రీనివాస్‌నాయక్‌లు తండాలోనే తండ్రితో నివసిస్తున్నారు. చిన్నకుమారుడు శ్రీనివాస్‌నాయక్‌ తండ్రి పేరుతో ఓ ప్రైవేటు బీమా సంస్థలో రూ.50 లక్షలు ప్రమాద బీమా చేయించి నామినీగా తన పేరు నమోదు చేసుకున్నాడు. తనకు డబ్బు అవసరం ఉందని రెండు మూడు రోజులుగా శ్రీనివాస్‌నాయక్‌ తండ్రిని అడుగుతున్నాడు. తన దగ్గర లేదని ఆయన చెప్పడంతో.. శ్రీనివాస్‌నాయక్‌ దురాలోచన చేశాడు. తాండూరులో ఉన్న అన్న దగ్గరకు ఇద్దరం వెళ్దామని, అతడి వద్ద డబ్బు ఇప్పించమని నమ్మించి మంగళవారం తెల్లవారుజామున తండ్రిని ద్విచక్రవాహనంపై తీసుకుని వెళ్లాడు. కొడంగల్‌ మండలం ఉడిమేశ్వరం శివారులో ద్విచక్ర వాహనం అదుపు తప్పి పడిపోవడంతో తండ్రి చనిపోయాడని శ్రీనివాస్‌నాయక్‌ తండాకు తిరిగి వచ్చి.. నమ్మించే ప్రయత్నం చేశాడు. బీమా చేయించిన డబ్బు కోసమే అతడు తండ్రిని రాయితో కొట్టి చంపాడని రెండో కుమారుడు రవినాయక్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్యకేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు