సైబర్‌ మోసాలకిదో ఆధారం

ఆధార్‌లో సులభంగా చిరునామా మార్చుకునేందుకు ఉన్న అవకాశం సైబర్‌ మోసాలకు దారి తీసే అతి పెద్ద కారణాల్లో ఒకటని పోలీసులు తెలిపారు.

Updated : 29 Mar 2023 06:08 IST

సులభంగా చిరునామా మార్పే కారణమంటున్న పోలీసులు

దిల్లీ: ఆధార్‌లో సులభంగా చిరునామా మార్చుకునేందుకు ఉన్న అవకాశం సైబర్‌ మోసాలకు దారి తీసే అతి పెద్ద కారణాల్లో ఒకటని పోలీసులు తెలిపారు. పలు కేసులను విచారించగా ఈ విషయం బయటపడిందని వెల్లడించారు. దర్యాప్తు అధికారులు అందించిన వివరాల ప్రకారం.. ఆధార్‌ కార్డున్న వ్యక్తి దరఖాస్తును డౌన్‌లోడ్‌ చేసుకుని, దానిని నింపి.. ఎంపీ, ఎమ్మెల్యే, మున్సిపల్‌ కౌన్సిలర్‌, గెజిటెడ్‌ అధికారి, ఎంబీబీఎస్‌ వైద్యుడి సంతకంతో అప్‌లోడ్‌ చేస్తే చిరునామా మారుతోంది. ఇందులో చాలావరకు నకిలీ రబ్బరు స్టాంపులు, ఫోర్జరీ సంతకాలు ఉంటున్నాయి. కొన్ని సందర్భాల్లో ఆయా వ్యక్తుల వివరాలను తెలుసుకోకుండా ఈ అధికార ప్రముఖులు నిర్లక్ష్యంగా సంతకాలు చేయడమూ సైబర్‌ మోసాలకు కారణమవుతోంది. ఉదాహరణకు ఒక కేసు దర్యాప్తులో భాగంగా విచిత్రమైన విషయం బయటపడింది. చిరునామా మార్పు కోసం ఓ వ్యక్తి దరఖాస్తుపై ఎమ్మెల్యే సంతకం చేశారు. దర్యాప్తు జరపగా.. స్టాంపు వేసే పనిని ఆఫీస్‌ బాయ్‌కు ఆయన అప్పగించినట్లు తేలింది. ఎమ్మెల్యే కేవలం సంతకాలకే పరిమితమయ్యారు. మరో కేసులో ఇద్దరు నైజీరియన్లతోపాటు ఆరుగురు చిరునామాలను మార్చి ఎన్నారై పెళ్లి కుమారుల్లా అమ్మాయిలకు వల వేశారు. ఈ కేసులో కేవలం రూ.500 తీసుకుని ఓ వైద్యుడు సంతకం చేశారు. సైబర్‌ మోసగాళ్లు చాలాసార్లు చిరునామాలను మార్చి బ్యాంకు ఖాతాలను తెరిచి బాధితుల నుంచి డబ్బు గుంజుతున్నారు. ఆధార్‌ కార్డుల అప్‌డేషన్‌లోనూ కొందరు మోసాలు చేస్తున్నారు. ఎడమచేతి వేలి ముద్రలను కుడి చేతివిగా, కుడి చేతివి ఎడమ చేతివిగా నమోదు చేయించడంతోపాటు రంగుల కాంటాక్ట్‌ లెన్స్‌తో ఆధార్‌ వివరాలను మార్చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని