సేవ చేస్తామంటూ.. బురిడీ కొట్టించారు!

కార్పొరేట్‌ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్‌) కింద సర్కారు బడులను బాగు చేస్తామని ఓ సంస్థ చెప్పడంతో ఉన్నతాధికారులు సరే అన్నారు.

Updated : 29 Mar 2023 06:05 IST

సర్కారు బడుల్లో నియామకాల పేరిట నిరుద్యోగుల నుంచి రూ.లక్షల్లో వసూలు

ఆదిలాబాద్‌ పాలనాప్రాంగణం, న్యూస్‌టుడే: కార్పొరేట్‌ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్‌) కింద సర్కారు బడులను బాగు చేస్తామని ఓ సంస్థ చెప్పడంతో ఉన్నతాధికారులు సరే అన్నారు. అదే అదనుగా ఆ సంస్థ బడుల్లో ఉద్యోగాలంటూ రూ.లక్షలు వసూలు చేస్తున్న ఘటన ఆదిలాబాద్‌ జిల్లాలో బయటపడింది. సీఎస్‌ఆర్‌ కింద ప్రభుత్వ పాఠశాలల్లో సాంస్కృతిక, కృత్యాధార బోధనతోపాటు న్యూట్రిగార్డెన్‌లు అభివృద్ధి చేస్తామంటూ కేర్‌ ఫౌండేషన్‌ పేరిట కొందరు ప్రతినిధులు ఫిబ్రవరి 22న ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ను కలిశారు. ఆయన జిల్లా అదనపు కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ను కలవాలని సూచించారు. అదనపు కలెక్టర్‌ను కలిసిన ప్రతినిధులు.. సీఎస్‌ఆర్‌ కింద పాఠశాలల్లో బోధకులతోపాటు పోషకాలు అందించేలా బడి తోటలను అభివృద్ధి చేస్తామంటూ ఓ లేఖను అందించారు. వారి మాటలు నమ్మిన ఆయన పాఠశాలల జాబితా కోసం డీఈవోను కలవాలని పురమాయించారు. ఈ క్రమంలో 130 బడుల జాబితాను ఇస్తూ సదరు సంస్థకు సహకారం అందించాలని హెచ్‌ఎంలకు సూచిస్తూ ఈ నెల 3న డీఈవో కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక్కడే అసలు తంతు మొదలైంది. డీఈవో కార్యాలయ ఉత్తర్వు కాపీని జత చేస్తూ పాఠశాలల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయని సదరు సంస్థ ప్రతినిధులు నిరుద్యోగులకు గాలం వేశారు. ఏకంగా అపాయింట్మెంట్‌ లెటర్లు ఇస్తూ నిరుద్యోగులను పాఠశాలలకు పంపుతున్నారు. వీరు సీఎస్‌ఆర్‌ కింద పని చేస్తున్నారని ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు కూడా నమ్మారు.

బయటపడిందిలా..

బేల ప్రాంతం నుంచి ఒకరు విద్యాశాఖ సెక్టోరల్‌ అధికారి నర్సయ్యకు ఫోన్‌ చేసి.. ‘ఏదో టీచరు పోస్టుకు ఫౌండేషన్‌ వారు రూ.2 లక్షలు కావాలంటున్నారు. కన్సెషన్‌ ఇప్పించండి’ అని కోరడంతో వసూళ్ల పర్వం బయటపడింది. వెంటనే తేరుకున్న అధికారులు.. ఆ సంస్థ లెటర్లతో వచ్చే వారిని చేర్చుకోవద్దని హెచ్‌ఎంలకు సందేశాలు పంపారు.


ఫిర్యాదు చేస్తే చర్యలు

కిందటి నెలలో ఓ ఫౌండేషన్‌ వారు మమల్ని కలిసిన మాట వాస్తవమే. సీఎస్‌ఆర్‌ కింద పాఠశాలల్లో సౌకర్యాలు సమకూరుస్తామంటే సహకరిస్తామని చెప్పాం. అంతేగానీ ఆ సాకుతో డబ్బులు వసూలు చేస్తున్న విషయం మాకు తెలియదు. ఎవరైనా వారికి డబ్బులు ఇచ్చినట్లు ఫిర్యాదు చేస్తే ఫౌండేషన్‌ ప్రతినిధులపై చర్యలు తీసుకుంటాం. ఆ సంస్థను బ్లాక్‌ లిస్టులో పెట్టి వసూలు చేసిన డబ్బులను తిరిగి ఇప్పిస్తాం.

రిజ్వాన్‌ బాషా షేక్‌, అదనపు పాలనాధికారి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని