Couple Suicide: కరోనా దెబ్బకు నెమ్మదించిన వ్యాపారం.. అధిక వడ్డీలకు అప్పులతో..

మధ్యతరగతి జీవితాలపై కరోనా ప్రభావం ఇప్పటికీ చూపిస్తోంది. మూడేళ్ల కిందట కొవిడ్‌తో పోరాడిన ఇంటిల్లిపాది.. అప్పులు చేసి దాన్నుంచి కోలుకుంది.

Updated : 30 Mar 2023 09:25 IST

సెల్ఫీ వీడియో తీసుకున్న దంపతుల  మృతదేహాలు ఏలేరు కాలువలో గుర్తింపు
 

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: మధ్యతరగతి జీవితాలపై కరోనా ప్రభావం ఇప్పటికీ చూపిస్తోంది. మూడేళ్ల కిందట కొవిడ్‌తో పోరాడిన ఇంటిల్లిపాది.. అప్పులు చేసి దాన్నుంచి కోలుకుంది. ఎలాగైనా నిలదొక్కుకోవాలని మరిన్ని అప్పులు చేసి వ్యాపారంలో పెట్టింది. కానీ, కరోనా దెబ్బకు నెమ్మదించిన వ్యాపారం ఎంతకూ ఆశించిన మేర నడవలేదు. పెరిగిపోతున్న అప్పులు చూసి ఎలా తీర్చాలో తెలియక ఆ ఇంటి పెద్దలు ఆత్మహత్యే శరణ్యంగా భావించారు.

‘మేం వెళ్లిపోతున్నాం. పిల్లలూ జాగ్రత్త’ అంటూ సెల్ఫీ వీడియో తీసుకుని, ఈ నెల 27న కనిపించకుండా పోయిన ఆ దంపతులు బుధవారం అనకాపల్లి సమీపంలోని ఏలేరు కాలువలో విగతజీవులై తేలారు. విశాఖ నగరం వడ్లపూడి తిరుమలనగర్‌ సమీపంలోని శివాజీనగర్‌కు చెందిన చిత్రాడ వరప్రసాద్‌ (47), మీరా (41) దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తెకు 2021లో వివాహం చేశారు. వరప్రసాద్‌ విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మాస్టర్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. కూర్మన్నపాలెంలో బ్యాటరీ దుకాణం పెట్టగా.. కుమారుడు చూసుకుంటున్నారు.

మూడేళ్ల కిందట ఇంట్లో అందరికీ కొవిడ్‌ సోకింది.  వైద్యానికి అప్పులు చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత దుకాణం నిర్వహణ, ఇతర అవసరాలకు అధిక వడ్డీలకు మరిన్ని అప్పులు చేశారు. వీటిని ఎలా తీర్చాలని కొన్ని రోజులుగా మనోవేదనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే ‘మేం ఆత్మహత్య చేసుకుంటున్నాం’ అంటూ సెల్ఫీ వీడియో తీసుకొని ఆ ఫోన్‌ను ఇంట్లో పెట్టి కనిపించకుండా పోయారు. ఈ విషయం కుమారుడు పోలీసులకు తెలపగా.. సోమవారం నుంచి వారి కోసం వెతికారు. ఏలేరు కాలువ గట్టున వారి వస్తువులు గుర్తించి అందులో గాలించారు. బుధవారం ఉదయం రాజుపాలెం వద్ద కాలువలో మృతదేహాలు లభ్యమైనట్లు దువ్వాడ ఎస్సై దేముడుబాబు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని