పులివెందుల కాల్పుల్లో గాయపడ్డ వ్యక్తికి చిత్తూరులో చికిత్స

వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందులలో మంగళవారం జరిగిన కాల్పుల్లో గాయపడిన మహబూబ్‌బాషా అలియాస్‌ మస్తాన్‌ బాషాకు.. చిత్తూరు నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించారు.

Published : 30 Mar 2023 04:59 IST

చిత్తూరు(నేరవార్తలు), న్యూస్‌టుడే: వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందులలో మంగళవారం జరిగిన కాల్పుల్లో గాయపడిన మహబూబ్‌బాషా అలియాస్‌ మస్తాన్‌ బాషాకు.. చిత్తూరు నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించారు. మంగవారం అర్ధరాత్రి ఆసుపత్రిలో చేరిన అతడికి ప్రథమ చికిత్స అందించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. బాషా ఎడమ చేతిలో, ఎడమకాలి తొడ భాగంలో పెల్లెట్లు (బుల్లెట్‌ రవ్వలు) ఉండిపోయాయి. బాషాకు బుధవారం ఎముకల వైద్య నిపుణుడు భరత్‌రెడ్డి వైద్య పరీక్షలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బాషా చేతిలో దిగిన బుల్లెట్‌ వెనక్కు వచ్చిందని, ఎముకలు ఛిద్రమయ్యాయని చెప్పారు. చేతిలో బుల్లెట్‌ పెల్లెట్లు (రవ్వలు) ఐదారు వరకు ఉన్నాయని, రెండుసార్లు చికిత్స చేయాల్సి ఉంటుందన్నారు. బాషా చిత్తూరు ప్రైవేటు ఆసుపత్రికే ఎందుకొచ్చారని విలేకరులు ప్రశ్నించగా.. తాను పులివెందులలో కొద్దికాలం వైద్యుడిగా పనిచేశానని, ఆ పరిచయంతోనే వచ్చారన్నారు. బుధవారం రాత్రి 9.30గంటలకు ఆయనకు శస్త్ర చికిత్స చేశారు.

ప్రశ్నించినందుకే కాల్పులు.. బాషా

గాయపడిన మహబూబ్‌బాషాను విలేకరులు పలకరించగా దిలీప్‌తో భరత్‌కుమార్‌ యాదవ్‌ గొడవ పడుతుండగా తాను ప్రశ్నించానన్నారు. ఆవేశానికి గురైన ఆయన దిలీప్‌పై కాల్పులు జరిపాడని, ఆపై తన చేతిపై, కాలిపై కాల్చడానికి యత్నించగా బుల్లెట్‌ పక్కగా వెళ్లిందన్నారు. అనంతరం తన తలపై తుపాకీ పెట్టి కాల్చగా.. బుల్లెట్లు లేకపోవడంతో ప్రాణాలతో మిగిలానని చెప్పారు. చిత్తూరు పోలీసులు ఆసుపత్రికి వచ్చి ఆయన నుంచి వివరాలు సేకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని