భరత్‌కుమార్‌ యాదవ్‌ అరెస్టు

వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందులలో తుపాకీతో కాల్పులు జరిపి ఒకరి ప్రాణాలు బలిగొన్న కేసులో నిందితుడు భరత్‌కుమార్‌ యాదవ్‌ను బుధవారం సాయంత్రం అరెస్టు చేసినట్లు పులివెందుల డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.

Published : 30 Mar 2023 04:59 IST

తుపాకీ, తూటాల స్వాధీనం

పులివెందుల, న్యూస్‌టుడే: వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందులలో తుపాకీతో కాల్పులు జరిపి ఒకరి ప్రాణాలు బలిగొన్న కేసులో నిందితుడు భరత్‌కుమార్‌ యాదవ్‌ను బుధవారం సాయంత్రం అరెస్టు చేసినట్లు పులివెందుల డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. అతని నుంచి తుపాకీ, రెండు తూటాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. స్థానిక పోలీసుస్టేషన్‌లో విలేకర్లతో మాట్లాడుతూ, నిందితుడి వివరాలను వెల్లడించారు. ‘పులివెందుల పట్టణం నగరిగుట్టవీధికి చెందిన భరత్‌కుమార్‌ యాదవ్‌, చింతకుంట దిలీప్‌, మారుతీనగర్‌కు చెందిన రాగిపాటి మహబూబ్‌ బాషా మధ్య ఆర్థిక లావాదేవీలున్నాయి. దిలీప్‌ తన పెళ్లి కోసం భరత్‌కుమార్‌ యాదవ్‌ వద్ద రూ.50వేలు అప్పుగా తీసుకున్నారు. ఆ డబ్బుల విషయమై మాట్లాడటానికి మంగళవారం పట్టణంలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం సమీపంలో ముగ్గురూ కలిశారు. అప్పు తిరిగి చెల్లించే విషయంలో గొడవపడ్డారు. దిలీప్‌కు మద్దతుగా మహబూబ్‌ బాషా మాట్లాడారు. దీంతో భరత్‌కుమార్‌ యాదవ్‌ ఇంటికి వెళ్లి లైసెన్సు రివాల్వర్‌ తీసుకొచ్చి దిలీప్‌, మహబూబ్‌ బాషాపై మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన వారిని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. దిలీప్‌ను కడపకు తీసుకెళ్తుండగా, మార్గమధ్యంలో మృతిచెందారు. దిలీప్‌ భార్య భాను ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నాం’ అని డీఎస్పీ తెలిపారు. నిందితుడిని అరెస్టు చేశామని, కోర్టులో హాజరుపరచనున్నట్లు చెప్పారు.

లైసెన్సు రద్దుకు సిఫార్సు చేస్తాం

2019లో కొంతమంది యువకులు భరత్‌కుమార్‌ యాదవ్‌పై హత్యాయత్నం చేశారు. ముఖ్యమైన కేసులో సాక్షిగా ఉన్నందున తనకు ప్రాణహాని ఉందని సీబీఐ అధికారులకు లేఖ రాశారు. పలు అంశాలను పరిగణలోకి తీసుకుని 2020 జూన్‌లో లైసెన్సు జారీచేశామని డీఎస్పీ తెలిపారు. తుపాకీ ఎక్కడ, ఎంతకు కొన్నారనే విషయాలు తెలుసుకుంటామన్నారు. లైసెన్సు రద్దు చేసేందుకు ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తామని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు