Crime News: ప్రియుడితో పారిపోయేందుకు.. తనలాగే ఉన్న యువతి హత్య

హరియాణా రాష్ట్రంలోని పానీపత్‌లో ఓ ప్రేమకథ వెర్రితలలు వేసింది. ప్రియుడితో కలిసి పారిపోయేందుకు పన్నాగం పన్నిన ప్రియురాలు చూడటానికి తనలాగే ఉన్న మరో యువతిని చంపింది.

Updated : 31 Mar 2023 07:26 IST

హరియాణా రాష్ట్రంలోని పానీపత్‌లో ఓ ప్రేమకథ వెర్రితలలు వేసింది. ప్రియుడితో కలిసి పారిపోయేందుకు పన్నాగం పన్నిన ప్రియురాలు చూడటానికి తనలాగే ఉన్న మరో యువతిని చంపింది. ఈ ఘటన 2017లో జరగగా.. ఇన్నేళ్లకు వాస్తవం బయటపడి ప్రియురాలికి శిక్ష పడింది. జ్యోతి, కృష్ణ కళాశాల రోజుల నుంచే ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి జ్యోతి ఇంట్లోవాళ్లు ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. కుటుంబసభ్యులకు అనుమానం రాకుండా ఉండేందుకు.. జ్యోతిలాగే ఉండే మరో యువతిని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. ఓ టీవీ సీరియల్‌ ఆధారంగా ఈ పథకం రచించారు.

దీని ప్రకారం 2017 సెప్టెంబర్‌ 5న.. జ్యోతి తన స్నేహితురాలు సిమ్రన్‌ను జీటీ రోడ్డుకు పిలిపించింది. ఆమె చేత మత్తు కలిపిన కూల్‌డ్రింక్‌ తాగించి, గొంతు కోసి చంపేశారు. సిమ్రన్‌ దుస్తులు మార్చి, ఆ స్థలంలో జ్యోతికి సంబంధించిన కొన్ని గుర్తింపు కార్డులు పడేసి ప్రేమికులిద్దరూ ఉడాయించారు. పోలీసులు చూపిన సిమ్రన్‌ మృతదేహం జ్యోతిదే అని భావించిన కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. మరోవైపు.. సిమ్రన్‌ తల్లిదండ్రుల ఫిర్యాదుతో అదృశ్యం కేసుపై విచారణ చేపట్టిన పోలీసులు.. యువతి హత్య తాలూకు ఫొటోలను ఆమె తల్లిదండ్రులకు కూడా చూపించగా మెడకున్న దారం, ముక్కుపుడక ఆధారంగా సిమ్రన్‌ అని గుర్తించారు. దీంతో జ్యోతి, కృష్ణలను వెదికే పనిలో పడ్డ పోలీసులు శిమ్లాలో వారిని గుర్తించి, 2020లో అదుపులోకి తీసుకున్నారు. కేసు కోర్టు విచారణలో ఉండగా క్షయవ్యాధితో కృష్ణ జైలులోనే చనిపోయాడు. ఈ ఘటనపై మంగళవారం తీర్పు చెప్పిన పానిపత్‌ కోర్టు.. జ్యోతికి జీవితఖైదు విధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని