పెళ్లి చేసుకోవాలని వేధింపులు.. యువకుణ్ని హతమార్చిన యువతి

పెళ్లి చేసుకోవాలంటూ నిత్యం వేధిస్తుండటాన్ని భరించలేక ఓ యువతి.. యువకుడిని కత్తితో పొడిచి హత్య చేసింది.

Updated : 31 Mar 2023 04:05 IST

ఏటూరునాగారం, న్యూస్‌టుడే: పెళ్లి చేసుకోవాలంటూ నిత్యం వేధిస్తుండటాన్ని భరించలేక ఓ యువతి.. యువకుడిని కత్తితో పొడిచి హత్య చేసింది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఏటూరునాగారం ఎస్సై డి.రమేష్‌ కథనం ప్రకారం.. ఏటూరునాగారంలోని అంబేడ్కర్‌నగర్‌కు చెందిన రాంటెంకి శ్రీనివాస్‌(30), జాడి సంగీత చిన్నప్పటి నుంచి స్నేహితులు. సంగీతకు తల్లిదండ్రులు, తోబుట్టువులు ఎవరూ లేరు. వివాహం కాలేదు. అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్న ఆ యువతి కూలి పనులు చేసుకుంటూ జీవిస్తోంది. శ్రీనివాస్‌కు వివాహమైనా కొన్నేళ్ల క్రితం భార్య అతణ్ని విడిచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్న ఆయన కూలి పనులకెళ్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలంటూ సంగీతను కొన్నాళ్లుగా శ్రీనివాస్‌ వేధిస్తున్నాడు. ఈ విషయమై బాధితురాలు గతంలో ఫిర్యాదు చేయగా.. పోలీసులు శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసి జైలుకు పంపారు. జైలు నుంచి వచ్చిన తర్వాత పద్ధతి మార్చుకోకుండా ఆమెను ఇంకా తీవ్రంగా వేధించాడు. బుధవారం రాత్రి 9 గంటలకు అతడు యువతి ఇంటికి వెళ్లి పిలవగా తలుపులు తెరవలేదు. అర్ధరాత్రి 12 గంటలకు మరోసారి వెళ్లాడు. అప్పటికే వేసుకున్న పథకం ప్రకారం సంగీత శ్రీనివాస్‌ను ఇంట్లోకి రానిచ్చింది. మాటల్లో పెట్టి అతడి చేతులు కట్టేసి ఇంటి బయట ఓ కొయ్యకు బంధించింది. తర్వాత కత్తితో పొడిచి హత్య చేసింది. అనంతరం పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. గురువారం ఉదయం సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు నిందితురాలిపై కేసు నమోదు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు