Andhra News: సీఎం జగన్‌పై పోస్టులు పెట్టారని ప్రవాసాంధ్రుడి అరెస్టు

ముఖ్యమంత్రి జగన్‌, వైకాపా ప్రభుత్వం, పార్టీపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై ప్రవాసాంధ్రుడైన పొందూరు కోటిరత్న అంజన్‌ను కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులు అరెస్టు చేశారు.

Updated : 31 Mar 2023 07:42 IST

రిమాండును తిరస్కరించిన అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి

ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే-గన్నవరం గ్రామీణం: ముఖ్యమంత్రి జగన్‌, వైకాపా ప్రభుత్వం, పార్టీపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై ప్రవాసాంధ్రుడైన పొందూరు కోటిరత్న అంజన్‌ను కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం తెల్లవారుజామునే ఆయన్ను అదుపులోకి తీసుకున్న వారు గురువారం సాయంత్రం అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి శిరీష ఎదుట హాజరుపరిచారు. నిందితుడు ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చేలా, రెండు వర్గాల మధ్య శతృత్వం పెంచేలా సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెడుతున్నారని.. రిమాండు విధించాలని పోలీసులు న్యాయమూర్తిని కోరారు. ఈ కేసులో రిమాండు అవసరం లేదని, నోటీసులిస్తే సరిపోతుందని నిందితుడి తరఫున న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి రిమాండు విధించటానికి నిరాకరించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

వైకాపా కార్యకర్త ఫిర్యాదుతో..

గన్నవరానికి చెందిన పొందూరు కోటిరత్నం అంజన్‌ అమెరికాలో ఎంఎస్‌ చదివి, అక్కడే కొన్నాళ్లు ఉద్యోగం చేశారు. తిరిగి భారత్‌ వచ్చి గన్నవరంలోని తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారు. అంజన్‌ను బుధవారం ఉదయం 6 గంటలకు గన్నవరం రాయ్‌నగర్‌లోని అతని నివాసం నుంచి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక వైకాపా కార్యకర్త, ఉల్లిపాయల కమీషన్‌ వ్యాపారి అయిన వంజరాపు నాగసూర్య ప్రశాంత్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, అంజన్‌పై ఐపీసీ సెక్షన్‌లోని 153ఏ కింద కేసు నమోదు చేశారు. అంజన్‌ను అదుపులోకి తీసుకునే సమయంలో ఫోను, ల్యాప్‌ట్యాప్‌, ట్యాబ్‌లు స్వాధీనం చేసుకున్న గన్నవరం పోలీసులు వాటిని పరిశీలించారు. అంజన్‌ యువగళం అనే ట్విటర్‌ ఖాతాతో తెదేపాకు అనుకూలంగా, వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతున్నారని రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.

పోస్టులు పెట్టమని ఎవరైనా ప్రోత్సహిస్తున్నారా?

అంజన్‌ను అదుపులోకి తీసుకున్న తర్వాత బుధవారం ఉంగుటూరు స్టేషన్‌కు పోలీసులు తరలించారు. అదేరోజు మధ్యాహ్నం పెదపారుపూడి స్టేషన్‌కు తీసుకెళ్లారు. ట్విటర్‌లో సీఎం జగన్‌కు, వైకాపా సర్కారుకు వ్యతిరేకంగా పెట్టిన పోస్టులపై తెదేపా నాయకులు, ఇతరుల ప్రమేయం ఏమైనా ఉందా? అని పోలీసులు ప్రశ్నించారు. పోస్టులు పెట్టమని ఎవరైనా ప్రోత్సహిస్తున్నారా? పోస్టులకు తెదేపా నుంచి ఏమైనా నగదు అందుతోందా? అన్న కోణంలో ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. కేవలం వ్యక్తిగతంగానే ఆయా పోస్టులు పెట్టినట్లు అంజన్‌ వివరించారు. ఇకపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టొద్దంటూ కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అనంతరం అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి శిరీష నివాసానికి తీసుకొచ్చి ఆమె ఎదుట హాజరుపర్చారు. అంజన్‌ను రిమాండ్‌కు ఇవ్వాలని పోలీసులు కోరారు. స్టేషన్‌ బెయిల్‌ సెక్షన్‌ కావడంతో సొంత పూచీకత్తుపై విడుదల చేయాలని జడ్జి ఆదేశించారు. అంజన్‌ హోమోసెక్సువల్‌ అంటూ పోలీసులు రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఇది సుప్రీంకోర్టు ఆదేశాలకు పూర్తి విరుద్ధమని, ఇలా చెప్పడం వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించడమే కాక చట్ట విరుద్ధమని న్యాయ నిపుణులు అంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు