ఇద్దరు విద్యార్థుల ప్రాణం తీసిన ఇసుక గుంతలు

కృష్ణా నది నుంచి ఇసుక తరలించేందుకు వేసిన మట్టి కట్ట చుట్టూ తవ్విన భారీ గుంతలు ఇద్దరు విద్యార్థుల ప్రాణాలు తీశాయి.

Published : 31 Mar 2023 05:04 IST

పల్నాడు జిల్లా అమరావతిలో పండగ పూట విషాదం

అమరావతి, న్యూస్‌టుడే: కృష్ణా నది నుంచి ఇసుక తరలించేందుకు వేసిన మట్టి కట్ట చుట్టూ తవ్విన భారీ గుంతలు ఇద్దరు విద్యార్థుల ప్రాణాలు తీశాయి. పరీక్షలు రాసి ఇంటికొచ్చిన విద్యార్థులు స్నేహితులతో కలిసి కృష్ణా నదిలో ఈతకు వెళ్లి ఆ గుంతల్లో పడి మృత్యువాత పడ్డారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటన గురువారం సాయంత్రం పల్నాడు జిల్లా అమరావతిలో చోటుచేసుకుంది. పెదకూరపాడు మండలం 75త్యాళ్లూరుకు చెందిన మల్లికార్జునరెడ్డి (17), రాజశేఖరరెడ్డి (17) గుంటూరులోని ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు రాసి ఇటీవలే సొంతూరికి వచ్చారు. గురువారం గ్రామంలో శ్రీరామ నవమి ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మధ్యాహ్నం సెల్‌ఫోన్‌ మరమ్మతు చేయించుకోవాలని చెప్పి స్నేహితులు కార్తీకరెడ్డి, నాగనితిన్‌రెడ్డితో కలిసి అమరావతి వచ్చారు. అమరేశ్వరఘాట్‌ సమీపంలోని కృష్ణా నదిలో ఈతకు వెళ్లారు. అక్కడ లోతు తెలియకపోవడంతో మల్లికార్జునరెడ్డి, రాజశేఖరరెడ్డి నీటిలో మునిగిపోయారు. స్థానికులు వారిని కాపాడేందుకు ప్రయత్నించినా అప్పటికే వారిద్దరూ మృత్యువాత పడ్డారు. సెలవులకు ఇంటికి వచ్చిన పిల్లలిద్దరూ విగతజీవులుగా మారడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అమరావతి రీచ్‌లో తవ్విన ఇసుక రవాణా కోసం కృష్ణా నదికి అడ్డుగా మట్టి కట్ట వేశారు. దీనికోసం ఇరువైపులా సుమారు 20 అడుగుల లోతు గుంతలు తవ్వారు. ఆ గుంతల్లో పడి విద్యార్థులు మృత్యువాత పడ్డారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని