పైసలివ్వనందుకు ప్రాణాలతో చెలగాటం

అతను జల్సాలకు అలవాటు పడ్డాడు. పైగా దుబాయ్‌ వెళ్లేందుకు డబ్బులు కావాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చాడు. పైసలు సమకూర్చకుంటే అందరం చచ్చిపోదామంటూ చెరువు వద్దకు బలవంతంగా తీసుకెళ్లాడు.

Updated : 01 Apr 2023 05:15 IST

తల్లిదండ్రులతో నీటిలో మునిగే ప్రయత్నం
తండ్రి మృతితో బయటికి వచ్చిన కుమారుడు

కామారెడ్డి నేరవిభాగం, న్యూస్‌టుడే: అతను జల్సాలకు అలవాటు పడ్డాడు. పైగా దుబాయ్‌ వెళ్లేందుకు డబ్బులు కావాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చాడు. పైసలు సమకూర్చకుంటే అందరం చచ్చిపోదామంటూ చెరువు వద్దకు బలవంతంగా తీసుకెళ్లాడు. నీటిలో మునిగిపోతున్న తండ్రిని అలాగే వదిలేసి, తల్లిని తీసుకొని బయటకు వచ్చాడు. ఈ ఘటన కామారెడ్డిలో శుక్రవారం చోటుచేసుకుంది. పట్టణ సీఐ నరేశ్‌ కథనం ప్రకారం... స్థానిక విద్యానగర్‌ కాలనీలో నివాసముండే మహ్మద్‌ సలీం(55), రేష్మాబేగం దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు కలీం సంతానం. కలీంకు రెండేళ్ల క్రితం వివాహమైంది. తాగుడుకు బానిసవడంతో భార్య అతన్ని విడిచిపెట్టింది. పనిచేయకుండా తిరిగే కలీం డబ్బుల కోసం తల్లిదండ్రులతో నిత్యం గొడవ పడేవాడు. దుబాయ్‌ వెళ్తానని, తనకు డబ్బులు ఇవ్వాలని ఇటీవల వారిని వేధించసాగాడు. వారం రోజుల్లో సమకూరుస్తామని చెప్పినా వినకుండా శుక్రవారం సాయంత్రం వారితో గొడవ పడ్డాడు. డబ్బులిస్తారా.. చావమంటారా అంటూ వాదనకు దిగాడు. అనంతరం ముగ్గురం చనిపోదామంటూ చెరువు వద్దకు తీసుకెళ్లాడు. నీటిలో దిగిన తండ్రి సలీం మునిగిపోయాడు. భయపడిన కలీం భయంతో తల్లిని ఒడ్డుకు తీసుకుని బయటకు వచ్చేశాడు. విషయం తెలుసుకున్న బంధువులు పరుగున వచ్చి మృతదేహాన్ని బయటకు తీశారు. రేష్మాబేగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు