నిజామాబాద్‌లో మరో వైద్య విద్యార్థి ఆత్మహత్య

నిజామాబాద్‌లో శుక్రవారం మరో వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఫిబ్రవరి 25న దాసరి హర్ష అనే విద్యార్థి బలవన్మరణం ఘటనను మరవక ముందే మరో విద్యార్థి ప్రాణాలు తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

Updated : 01 Apr 2023 04:51 IST

నెలరోజుల వ్యవధిలో రెండో ఘటన

నిజామాబాద్‌ వైద్యవిభాగం, వినాయక్‌నగర్‌, సెంటినరీకాలనీ, న్యూస్‌టుడే: నిజామాబాద్‌లో శుక్రవారం మరో వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఫిబ్రవరి 25న దాసరి హర్ష అనే విద్యార్థి బలవన్మరణం ఘటనను మరవక ముందే మరో విద్యార్థి ప్రాణాలు తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ రెండో సంవత్సరం చదువుతున్న మోసం సనత్‌(22) వసతిగృహంలోని తన గదిలో ఉరేసుకున్నాడు. నగరంలోని ఒకటో ఠాణా ఎస్‌హెచ్‌వో విజయ్‌బాబు తెలిపిన ప్రకారం... పెద్దపల్లి జిల్లా సెంటినరీకాలనీలో ఉంటున్న రమేశ్‌, సుజాత దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సాయి మూడు నెలల క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లగా చిన్నకుమారుడు సనత్‌ నిజామాబాద్‌లో వైద్య విద్య అభ్యసిస్తున్నాడు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన రమేశ్‌ సింగరేణి ఓసీపీ-2లో వెల్డర్‌గా ఉద్యోగం చేస్తూ 15 ఏళ్లుగా సెంటినరీకాలనీలో నివాసముంటున్నారు. సనత్‌ గురువారం వసతిగృహం మూడో అంతస్తులోని తన గదిలో అర్ధరాత్రి వరకు స్నేహితులతో కలిసి చదువుకున్నాడు. ముగ్గురు ఉండాల్సిన గదిలో చదువు పూర్తికాగానే ఇద్దరు స్నేహితులు కూలర్‌ ఉన్న పక్క గదికి వెళ్లి నిద్రపోయారు. ఒంటరిగా ఉన్న సనత్‌ శుక్రవారం తెల్లవారుజామున 3.11 గంటలకు ‘సారీ మమ్మీ, డాడీ, అన్నయ్య... వాస్తవానికి నేను ఇలా చేద్దామని ఫార్మా పేపర్‌-1 అయ్యాకే అనుకున్నా. కానీ, అమ్మ, స్నేహితులు ఆందోళనకు గురవుతారని చేసుకోలే. సాయీ... నువ్వు యూఎస్‌ నుంచి వచ్చి ఇక్కడే ఉండు’ అని వాట్సప్‌లో మెసేజ్‌ టైప్‌ చేసి తనకు తానే పంపించుకున్నాడు. శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలు దాటినా సనత్‌ బయటికి రాకపోవడంతో తోటి స్నేహితులు తలుపులు కొట్టారు. అతని నుంచి స్పందన లేకపోవడంతో తలుపులను బలవంతంగా తెరిచి చూడగా బెడ్‌షీట్‌తో ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించాడు. భీతిల్లిన విద్యార్థులు... వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని కిందకు దించారు. మధ్యాహ్నం సమయంలో తల్లిదండ్రులు సుజాత, రమేష్‌లు నిజామాబాద్‌ చేరుకున్నారు. తమ కుటుంబంలో  సమస్యలు లేవని మీడియాతో చెప్పారు. విద్యార్థి ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఇందిర మాట్లాడుతూ... 2020 బ్యాచ్‌కు చెందిన విద్యార్థి సనత్‌ చదువులో మెరుగ్గా ఉండేవాడని ఇలా జరగడం బాధాకరమన్నారు.

తిరుపతికి వెళ్దామన్నావే... ఇలా చేశావేంటి నాన్నా?

‘మరో నాలుగు రోజుల్లో ప్రాక్టికల్‌ పరీక్షలు ముగియగానే అందరం కలిసి తిరుపతికి, విజయవాడకు వెళ్దాం నాన్నా. టికెట్లు బుక్‌ చేయండి’ అంటూ ఫోన్‌ చేసి చెప్పిన కొడుకు అంతలోనే ఇలా ఎందుకు చేసుకున్నాడో తెలియడం లేదంటూ సనత్‌ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ‘మూడు ఆపరేషన్లు అయినా తట్టుకుని చదువు కొనసాగించావు. ఇప్పుడేమైందని ఇలా చేసుకున్నావు తండ్రీ...’ అని తల్లి విలపించడం అందర్నీ కలచివేసింది. సనత్‌ మృతితో సెంటినరీకాలనీలోనూ విషాదం నెలకొంది. అతను మొదటి నుంచీ చదువులో ప్రతిభ కనబరిచాడు. నీట్‌లో 540 మార్కులను తెచ్చుకుని, ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు సాధించాడు. ఎంబీబీఎస్‌ ప్రథమ సంవత్సరంలోనూ ఉత్తీర్ణత సాధించి రెండో సంవత్సరానికి అర్హత సాధించాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు