బెజవాడలో కిలో ఎండీఎంఏ డ్రగ్‌ పట్టివేత

విజయవాడలో మరోసారి డ్రగ్స్‌ కలకలం రేగింది. స్వాధీనం చేసుకున్న డ్రగ్‌ ఎండీఎంఏ అని, దీని బరువు కిలో వరకు ఉంటుందని సమాచారం.

Published : 02 Apr 2023 04:09 IST

ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే-పటమట: విజయవాడలో మరోసారి డ్రగ్స్‌ కలకలం రేగింది. స్వాధీనం చేసుకున్న డ్రగ్‌ ఎండీఎంఏ అని, దీని బరువు కిలో వరకు ఉంటుందని సమాచారం. బెంగళూరు నుంచి ఆర్టీసీ బస్సులో ఇది నగరానికి చేరింది. దీనిపై పోలీసులు నోరు మెదపడం లేదు. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలివీ..

దుస్తుల బ్యాగ్‌లో పెట్టుకుని..

బెంగళూరులోని కెంపెగౌడ బస్‌స్టేషన్‌లో శుక్రవారం ఉదయం 6 గంటలకు విజయవాడ వెళ్లే సూపర్‌ లగ్జరీ బస్సు డ్రైవర్‌ వద్దకు ఓ వ్యక్తి వచ్చాడు. బ్యాగ్‌లో దుస్తులు ఉన్నాయని, విజయవాడలో తన స్నేహితుడు వచ్చి తీసుకుంటాడని, అతని ఫోన్‌నంబరు డ్రైవర్‌కు ఇచ్చాడు. విజయవాడ వచ్చాక, రాత్రి 10.30కు బస్సును గ్యారేజీలో పెట్టి బయటకు వస్తుండగా ఓ యువకుడు వచ్చి బ్యాగ్‌ను తీసుకున్నాడు. అదే సమయంలో టాస్క్‌ఫోర్స్‌, పటమట పోలీసులు డ్రైవర్‌ను, యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ బ్యాగ్‌ తనిఖీ చేయగా.. ఓ ప్యాంటులో ఎండీఎంఏ డ్రగ్‌ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రైవర్‌ గతంలో ఎప్పుడైనా ఇలా తీసుకొచ్చేవారా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. పార్సిల్‌ను తీసుకునేందుకు వచ్చిన యువకుడు ఎవరెవరికి సరఫరా చేస్తున్నాడు, ఎవరెవరికి చేరుతోందన్న అంశాలను రాబడుతున్నట్లు సమాచారం.

బెంగళూరులో పెద్ద నెట్‌వర్క్‌

పట్టుబడ్డ డ్రగ్‌ ఎండీఎంఏగా అనుమానిస్తున్నారు. ఇది బెంగళూరు నుంచి వివిధ ప్రాంతాలకు రవాణా అవుతోంది. గత నెలలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సతీష్‌.. పాయసం మిక్స్‌ డబ్బాలో కాకినాడకు 46 గ్రాముల ఎండీఎంఏను తరలిస్తూ విజయవాడ బస్టాండ్‌లో దొరికిపోయాడు. ఇతను బెంగళూరులో అబ్దుల్‌ మిషాల్‌ అహ్మద్‌ అలియాస్‌ మిషాల్‌     నుంచి తీసుకున్నాడు. తాజాగా దొరికిన డ్రగ్‌నూ    అదే వ్యక్తి నుంచి కొన్నారా.. కొత్త ముఠానా అన్నది తేలలేదు. దీని వెనుక ఉన్న నెట్‌వర్క్‌ను ఛేదించే పనిలో పోలీసులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని