సాహితీ, ఫీనిక్స్‌ సంస్థల్లో ఈడీ సోదాలు

వెంచర్ల పేరుతో అమాయకులను మోసం చేసిన సాహితీ సంస్థలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) శనివారం సోదాలు నిర్వహించింది. దీనితోపాటు ఫీనిక్స్‌, ఔషధ రంగంలో ఉన్న మరో సంస్థలోనూ సోదాలు చేసి, పెద్దఎత్తున దస్త్రాలు, హార్డ్‌డిస్కులు, కంప్యూటర్లను స్వాధీనం చేసుకుంది.

Updated : 02 Apr 2023 05:28 IST

ఈనాడు, హైదరాబాద్‌: వెంచర్ల పేరుతో అమాయకులను మోసం చేసిన సాహితీ సంస్థలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) శనివారం సోదాలు నిర్వహించింది. దీనితోపాటు ఫీనిక్స్‌, ఔషధ రంగంలో ఉన్న మరో సంస్థలోనూ సోదాలు చేసి, పెద్దఎత్తున దస్త్రాలు, హార్డ్‌డిస్కులు, కంప్యూటర్లను స్వాధీనం చేసుకుంది. ప్రీలాంచింగ్‌ ఆఫర్‌ పేరిట సాహితీ ఇన్‌ఫ్రాటెక్‌ వెంచర్‌ ఇండియా ప్రయివేటు లిమిటెడ్‌ సంస్థ భారీ మోసానికి పాల్పడిన విషయం తెలిసిందే. పెద్దమొత్తంలో డబ్బు చెల్లించినా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు హైదరాబాద్‌, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో సాహితీ సంస్థపై కేసులు నమోదయ్యాయి. సుమారు రూ.2వేల కోట్ల మోసానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడవగా సంస్థ ఎండీ లక్ష్మీనారాయణ పోలీసులకు లొంగిపోయాడు. దాదాపు 3నెలలు జైలులో ఉండి ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యాడు. ఇదే కేసులో నిధుల మళ్లింపుపై ఈడీ మరో కేసు పెట్టింది. సాహితీ సంస్థ సేకరించిన నిధులను సొంత, ఇతర సంస్థల ఖాతాల్లోకి మళ్లించి... ఆస్తులు కూడబెట్టుకున్నట్లు అనుమానిస్తోంది. అందులో భాగంగానే బంజారాహిల్స్‌లోని సాహితీ సంస్థ ప్రధాన, ఇతర కార్యాలయాల్లో, ఎండీ లక్ష్మీనారాయణ ఇంట్లోనూ అధికారులు తనిఖీలు చేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో సాహితీ సంస్థకు భూమి ఉంది. ఇక్కడ సాహితీ వెంచర్స్‌, సాహితీ సర్వనీ ఎలైట్‌ పేరుతో పది టవర్లను నిర్మించి... డబుల్‌, ట్రిపుల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్లను తక్కువ ధరకు ఇస్తామంటూ పెద్దమొత్తంలో వసూలు చేశారు. ఇక్కడ కొంత భూమిని సాహితీ సంస్థ... ఫీనిక్స్‌ సంస్థకు అమ్మినట్లు దర్యాప్తులో వెల్లడైంది. దాంతో ఈడీ అధికారులు బంజారాహిల్స్‌లోని ఫీనిక్స్‌లోనూ సోదాలు చేశారు. వీటితోపాటు ఓ ఫార్మా కంపెనీలోనూ సోదాలు జరిగాయి. శనివారం ఉదయం ఏడు గంటలకు మొదలైన సోదాలు రాత్రి పొద్దు పోయేవరకూ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మూడుచోట్ల జరిగిన సోదాల్లో 25 ఈడీ బృందాలు పాల్గొన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు