అంగట్లో 66.9 కోట్ల మంది డేటా

దేశ ప్రజల డిజిటల్‌ డేటాను బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్న వ్యక్తిని సైబరాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు. 16.8 కోట్ల మంది డేటా చోరీ ఉదంతాన్ని మరువకముందే.. 24 రాష్ట్రాలు, ఎనిమిది మెట్రో నగరాలకు చెందిన 66.9 కోట్ల మంది వ్యక్తిగత సమాచారాన్ని అంతర్జాలంలో అమ్మకానికి పెట్టిన నిందితుడిని అరెస్టు చేశారు.

Published : 02 Apr 2023 05:08 IST

ఆన్‌లైన్‌లో 24 రాష్ట్రాలు, 8 నగరాల ప్రజల సమాచారం
ఫరీదాబాద్‌ కేంద్రంగా దందా
నిందితుడి అరెస్టు
సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర వెల్లడి

ఈనాడు- హైదరాబాద్‌: దేశ ప్రజల డిజిటల్‌ డేటాను బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్న వ్యక్తిని సైబరాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు. 16.8 కోట్ల మంది డేటా చోరీ ఉదంతాన్ని మరువకముందే.. 24 రాష్ట్రాలు, ఎనిమిది మెట్రో నగరాలకు చెందిన 66.9 కోట్ల మంది వ్యక్తిగత సమాచారాన్ని అంతర్జాలంలో అమ్మకానికి పెట్టిన నిందితుడిని అరెస్టు చేశారు. దీన్ని 104 కేటగిరీలుగా విభజించి.. అంగట్లో సరకులా విక్రయిస్తున్నాడు. ఇందులో ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ సంస్థలకు చెందిన రహస్య, సున్నిత సమాచారమూ ఉంది. నిందితుడు దిల్లీకి చెందిన వినయ్‌ భరద్వాజ్‌ను పోలీసులు ఫరీదాబాద్‌లో పట్టుకున్నారు. అతని వద్ద రెండు ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, డేటా స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, క్రైమ్స్‌ డీసీపీ కల్మేశ్వర్‌ సింగెనవార్‌ శనివారం ప్రకటన విడుదల చేశారు.

కేటగిరీల వారీగా ధరలు..

వినయ్‌ భరద్వాజ్‌ గతంలో వెబ్‌ డిజైనర్‌గా పనిచేసేవాడు. ఆ సమయంలో పరిచయమైన ఓ వ్యక్తి నుంచి డేటా కొన్నాడు. దీన్ని వెబ్‌ డిజైనింగ్‌ కోసం వచ్చేవారికి విక్రయించేవాడు. ఇది లాభదాయకంగా కనిపించడంతో పలువురు వ్యక్తుల నుంచి డేటా కొని.. అమ్మడం ప్రారంభించాడు. అమర్‌ సోహైల్‌, మదన్‌ గోపాల్‌ల నుంచి పెద్దఎత్తున డేటా కొన్న వినయ్‌.. ఆన్‌లైన్‌ వేదికగా సైబర్‌ నేరగాళ్లు, ప్రకటనకర్తలు తదితరులకు విక్రయిస్తున్నాడు. ఇందుకు ఎనిమిది నెలల క్రితం హరియాణాలో ఫరీదాబాద్‌లోని బల్లభ్‌గఢ్‌లో ప్రత్యేకంగా కార్యాలయం ఏర్పాటు చేశాడు. ఇన్‌స్పైర్‌ వెబ్స్‌ పేరుతో వెబ్‌సైట్‌ను రూపొందించి.. అందులో వేర్వేరు కేటగిరీలుగా డేటాను ఉంచాడు. వ్యక్తుల మొబైల్‌ నంబర్లు, ఈమెయిల్‌ ఐడీ, చిరునామా, పిన్‌కోడ్‌, ఈ-కామర్స్‌ ఖాతాదారులైతే ఎప్పుడెప్పుడు ఏయే వస్తువులు కొన్నారు? చివరిసారి ఏం కొన్నారు? విద్యార్థులైతే ఏయే కళాశాలల్లో చదువుతున్నారు? వారి తల్లిదండ్రుల వృత్తి, ఫోన్‌ నంబర్లు, నిరుద్యోగులు, ఆన్‌లైన్‌లో ఆర్థిక లావాదేవీలు జరిపేవారు, జీఎస్టీ చెల్లింపుదారులు, అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌, బిగ్‌ బాస్కెట్‌, ఇన్‌స్టాగ్రామ్‌, జొమాటో, పాలసీబజార్‌ వినియోగదారులు, వాహనదారుల వివరాలు వంటివి ఇందులో ఉన్నాయి. 10 వేల మంది ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్ల డేటాకు రూ.2,520.. 50 వేల మంది ఫేస్‌బుక్‌ ఫాలోవర్లకు రూ.15 వేల ధర పెట్టాడు. కొనుగోలుదారులు ఆన్‌లైన్‌లో డబ్బు చెల్లించగానే డేటాకు సంబంధించిన మెయిల్‌కు క్లౌడ్‌ లింకు పంపించేవాడు. దాన్ని త్వరగా డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి తాను పంపే సాఫ్ట్‌వేర్‌ తీసుకోవాలంటూ అదనంగా వసూలు చేసేవాడు. ఏ రాష్ట్రంలో ఎవరి డేటా అవసరమో తెలుసుకునేందుకు ప్రత్యేకంగా టెలీకాలర్లను నియమించుకున్నాడు. ప్రచారం కోసం సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు సైతం తెరిచాడు.

ఆ ఇద్దరు ఎవరు?

నిందితుడికి డేటాను విక్రయించిన అమర్‌ సోహైల్‌, మదన్‌ గోపాల్‌ ఎవరు? వీరు ఎవరెవరికి విక్రయించారనే అంశం వెల్లడవ్వాల్సి ఉంది. 16.8 కోట్ల మంది డేటా చౌర్యం కేసు తరహాలోనే ఇందులోనూ రక్షణ రంగ అధికారుల డేటా లభ్యమైంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలకు చెందిన ఉద్యోగుల సమాచారమూ ఉంది. పెద్దఎత్తున సున్నిత, రహస్య డేటా విక్రయిస్తున్న నేపథ్యంలో కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నామని ఉన్నతాధికారి తెలిపారు. డేటా లీకవ్వడానికి వాటిని సేకరించే సంస్థల వైఫల్యమే కారణమని, వాటికి నోటీసులిచ్చి విచారిస్తామని పేర్కొన్నారు. అమర్‌ సోహైల్‌, మదన్‌ గోపాల్‌లు పరారీలో ఉన్నారని.. వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు. వినయ్‌ భరద్వాజ్‌ని కస్టడీలోకి తీసుకుని విచారించనున్నట్లు పేర్కొన్నారు.

ప్రైవేట్‌ ఉద్యోగి ఫిర్యాదుతో కదిలిన డొంక

నగరానికి చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో భారీ డేటా చౌర్యం గుట్టురట్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. గచ్చిబౌలికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి సైబర్‌ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వివిధ బ్యాంకులకు చెందిన క్రెడిట్‌కార్డు వినియోగదారుల వివరాలను ఆన్‌లైన్‌ వేదికగా విక్రయిస్తున్నట్లు అతను గుర్తించాడు. దీనిపై జస్ట్‌ డయల్‌లో డేటా ప్రొవైడర్ల కోసం ఆరా తీయగా.. అతన్ని కొందరు సంప్రదించారు. ఈ క్రమంలోనే వినయ్‌ భరద్వాజ్‌ ఫోన్‌ చేశారు. క్రెడిట్‌ కార్డు ఖాతాదారుల సమాచారం తన దగ్గర ఉందని, డబ్బు కడితే పంపిస్తానని చెప్పాడు. తొలుత కొంత నమూనా డేటా పంపాడు. డీమ్యాట్‌ ఖాతాదారులు, వివిధ సంస్థల సీఈవోలు, ఉద్యోగుల వివరాలూ ఇస్తానని చెప్పాడు. దీంతో సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు అతను ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేసిన పోలీసులు.. నిందితుడిని శుక్రవారం అరెస్ట్‌ చేశారు.

2.66 కోట్ల మంది తెలుగు ప్రజల సమాచారం

నిందితుడి దగ్గర స్వాధీనం చేసుకున్న డేటాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 2.66 కోట్ల మంది సమాచారం లభ్యమైంది. ఒక్క ఆంధ్రప్రదేశ్‌ నుంచే 2.10 కోట్ల మంది సమాచారముంది. 56 లక్షల మంది హైదరాబాదీల డేటా ఉంది. ప్రైవేట్‌ ఉద్యోగుల ఫోన్‌ నంబర్లు, ఈమెయిల్‌ ఐడీలు, పనిచేసే సంస్థ/వృత్తి, నగరం, చిరునామా వివరాలున్నాయని అధికారులు తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌ జనాభా సుమారు 24 కోట్లు ఉండగా.. ఆ రాష్ట్రానికి సంబంధించి 21.39 కోట్ల మంది సమాచారం నిందితుడి దగ్గర ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని