స్టేషన్‌లోని సొత్తు కొట్టేసింది పోలీసులే

పోలీసులే దొంగలుగా మారారు. ఓ కేసులో స్వాధీనం చేసుకొని పోలీస్‌స్టేషన్‌లో ఉంచిన సొత్తును గుట్టుగా చోరీచేశారు. కర్నూలు తాలుకా అర్బన్‌ పోలీసుస్టేషన్‌లో ఈ ఉదంతం చోటుచేసుకుంది.

Published : 02 Apr 2023 05:09 IST

81.52 కిలోల వెండి, రూ.10 లక్షల  నగదు స్వాధీనం చేసుకున్నాం
ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ వెల్లడి

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: పోలీసులే దొంగలుగా మారారు. ఓ కేసులో స్వాధీనం చేసుకొని పోలీస్‌స్టేషన్‌లో ఉంచిన సొత్తును గుట్టుగా చోరీచేశారు. కర్నూలు తాలుకా అర్బన్‌ పోలీసుస్టేషన్‌లో ఈ ఉదంతం చోటుచేసుకుంది. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ ఈ కేసు వివరాలు వెల్లడించారు. 2021 జనవరి 27న తమిళనాడు వ్యాపారి భారతిగోవింద్‌రాజ్‌ ఎలాంటి పత్రాలు లేకుండా 105 కిలోల వెండి, రూ.2.05 లక్షల నగదు రవాణా చేస్తుండగా పట్టుకుని సీజ్‌ చేశారు. కర్నూలు తాలుకా అర్బన్‌ పోలీసుస్టేషన్‌లో సొత్తును భద్రపరచగా 2022లో అదే స్టేషన్‌లో రైటర్‌గా పనిచేసిన హెడ్‌ కానిస్టేబుల్‌ అమరావతి, కానిస్టేబుల్‌ రమణబాబు దానిపై కన్నేసి చోరీకి కుట్ర పన్నారు. అదే సంవత్సరం మే 24న ఆ స్టేషన్‌లో జప్తు చేసిన అక్రమ మద్యాన్ని ధ్వంసం చేసే కార్యక్రమం చేపట్టారు. ఇదే అదనుగా నిందితులు వెండి, నగదు అపహరించారు. తర్వాత బంగారం దుకాణం నిర్వహించే అమరావతి బంధువు భరత్‌సింహా ద్వారా విక్రయించారు. ఇటీవల తమిళనాడు వ్యాపారి వెండి కోసం రావటంతో సొత్తు మాయమైన విషయం వెలుగు చూసింది. నిందితులు రమణబాబు, అమరావతి, ఆమె భర్త విజయ్‌భాస్కర్‌, అతని తమ్ముడు భరత్‌సింహాలను అరెస్టు చేశారు. వారి నుంచి 81.52 కిలోల వెండి, రూ.10 లక్షల నగదు రికవరీ చేశారు. అమరావతి ప్రస్తుతం కౌతాళం పోలీసుస్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తుండగా..రమణబాబు కోడుమూరు పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇదంతా జరిగిందని, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు