Vizianagaram: పొట్టకొట్టొద్దని మేడ పైనుంచి దూకేశాడు

విజయనగరంలో మురుగు కాలువపై ఆక్రమణల తొలగింపులో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Updated : 13 Apr 2023 09:13 IST

విజయనగరం నేరవార్తా విభాగం, న్యూస్‌టుడే: విజయనగరంలో మురుగు కాలువపై ఆక్రమణల తొలగింపులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జీవనాధారమైన టీ కొట్టును తొలగించొద్దంటూ ఓ వ్యక్తి మేడ పైనుంచి దూకాడు. స్థానికుల వివరాల మేరకు.. స్థానిక ఐస్‌ ఫ్యాక్టరీ కూడలి వద్ద మురుగు కాలువపై కొందరు దుకాణాలు పెట్టుకున్నారు. వీటితో కాలువలో పూడిక పేరుకుపోతోందని నగర పాలక సంస్థ అధికారులు బుధవారం జేసీబీతో ఆక్రమణల తొలగింపు చేపట్టారు. ఈ క్రమంలో తొలగింపునకు కనీస గడువు ఇవ్వకుండా ఇష్టానుసారంగా పనులు చేస్తున్నారని బాధితులు నగరపాలక సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. రెండో పట్టణ సీఐ లక్ష్మణరావు బాధితులకు సర్ది చెప్పారు. అదే సమయంలో టీ కొట్టు నిర్వాహకుడు సత్యనారాయణ  తన షాప్‌ను అన్యాయంగా తొలగిస్తున్నారని, ఇటీవలే రేకులు వేసుకొని బాగు చేసుకున్నానని చెబుతూ అక్కడే ఉన్న దుకాణంపైకి ఎక్కాడు. విద్యుత్తు తీగలను పట్టుకొనేందుకు యత్నించారు. వెంటనే అధికారులు విద్యుత్తు సరఫరాను నిలిపివేయించి, అతనితో మాట్లాడేందుకు చూశారు. పట్టించుకోని సత్యనారాయణ భవనం పైనుంచి దూకేశారు. గాయపడ్డ ఆయన్ని అధికారులు ఆసుపత్రికి తరలించారు. నిబంధనల మేరకే ఆక్రమణల్ని తొలగించామని టీపీవో మధుసూదనరావు తెలిపారు. కనీస గడువు ఇవ్వకుండా షాపులను తొలగించడం అన్యాయమని మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు సత్తి అచ్చిరెడ్డి అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని