పండుటాకులపై పాశవిక దాడి: బూటుకాళ్లతో తన్నడంతో వృద్ధుడి మృతి..భార్యకు గాయాలు

పండుటాకుల్లా ఉన్న వృద్ధులను చూస్తేనే హృదయం ద్రవిస్తుంది. అలాంటి వారిపై కన్నూమిన్నూ తెలియని ఓ వ్యక్తి బూటు కాళ్లతో దాడి చేశాడు.

Updated : 17 Apr 2023 07:44 IST

కొత్తగూడెం నేరవిభాగం, న్యూస్‌టుడే: పండుటాకుల్లా ఉన్న వృద్ధులను చూస్తేనే హృదయం ద్రవిస్తుంది. అలాంటి వారిపై కన్నూమిన్నూ తెలియని ఓ వ్యక్తి బూటు కాళ్లతో దాడి చేశాడు. గుండెపై తన్నడంతో వృద్ధుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని కూలీలైన్‌ ఏరియాలో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... స్థానికులైన దొడ్డ పోచయ్య(75), లచ్చమ్మ దంపతులు కూరగాయల మార్కెట్లో పనులు చేసుకుంటూ బతుకుతున్నారు.

సంతానం లేకపోవడంతో బంధువుల కుమారుడు చందర్‌ను పెంచుకున్నారు. గ్యాస్‌ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న చందర్‌(30) అవివాహితుడు. స్థానికుడైన హరిప్రసాద్‌ ఇంట్లో సిలిండర్‌ వేసే క్రమంలో వారింటి ఫోన్‌నంబరు తీసుకున్నాడు. ఈ క్రమంలో చందర్‌ తరచూ తన భార్యను వేధిస్తున్నాడని హరిప్రసాద్‌ ఆవేశానికి గురయ్యాడు. నెల రోజుల క్రితం అదే విషయాన్ని ప్రశ్నించడానికి చందర్‌ ఇంటికి వెళ్లాడు. అతను ఇంట్లో లేకపోవడంతో, తీరు మార్చుకోకుంటే అంతం చేస్తానంటూ హెచ్చరించాడు. చందర్‌ ఇటీవల తల్లిదండ్రుల వద్దకు వచ్చినట్లు తెలుసుకున్న హరిప్రసాద్‌... ఆవేశంతో ఆదివారం తెల్లవారుజామున అక్కడికి వెళ్లాడు. చందర్‌ అక్కడ లేకపోవడంతో వృద్ధులను చితకబాదాడు. ఐటీసీˆలో కార్మికుడిగా పనిచేస్తున్న హరిప్రసాద్‌ తన విధుల్లో వినియోగించే బూట్లను ధరించి... వారిని విచక్షణా రహితంగా తన్నాడు. కొట్టొద్దని ఎంత ప్రాధేయపడినా వినిపించుకోకుండా పోచయ్య గుండెలపై ఎగిరి తన్నడంతో ఆయన అక్కడికక్కడే కన్నుమూశాడు. వృద్ధురాలి ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. వారి కుమారుడి ఆచూకీ తెలియరాలేదు. నిందితుడు పరారీలో ఉన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు