Kadapa: ఇన్సూరెన్స్‌ సొమ్ము కోసం మామనే చంపేశాడు!

బీమా సొమ్ము కోసం సొంత మామనే స్నేహితుడితో కలిసి అంతమొందించిన కేసులో ఇద్దరు నేరస్థులకు వైయస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరు రెండో అదనపు జిల్లా న్యాయస్థానం జీవిత ఖైదు విధించినట్లు ఎర్రగుంట్ల సీఐ మంజునాథరెడ్డి తెలిపారు.

Updated : 19 Apr 2023 07:22 IST

స్నేహితుడితో కలిసి హతమార్చి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే యత్నం  
ఇద్దరు నేరస్థులకు జీవిత ఖైదు

ఎర్రగుంట్ల, న్యూస్‌టుడే: బీమా సొమ్ము కోసం సొంత మామనే స్నేహితుడితో కలిసి అంతమొందించిన కేసులో ఇద్దరు నేరస్థులకు వైయస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరు రెండో అదనపు జిల్లా న్యాయస్థానం జీవిత ఖైదు విధించినట్లు ఎర్రగుంట్ల సీఐ మంజునాథరెడ్డి తెలిపారు. వైయస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన యరవల చెన్నకృష్ణారెడ్డి (59), లక్ష్మీప్రసన్న దంపతులు తమ పెద్దకూమర్తెను విద్యుత్తు శాఖలో పనిచేస్తున్న సింహాద్రిపురం మండలం బలపనూరు గ్రామానికి చెందిన రాయపాటి కిరణ్‌కుమార్‌రెడ్డికి ఇచ్చి పెళ్లి చేశారు. కొన్నాళ్లకు కిరణ్‌కుమార్‌రెడ్డి తన మామ చెన్నకృష్ణారెడ్డికి కోటి రూపాయలకు జీవిత బీమా చేయించాడు. పత్రాల్లో నామినీగా తన పేరు నమోదు చేయించాడు. 2019 జనవరి 30న మల్లెం శ్రీనివాసులరెడ్డి అనే స్నేహితుడితో కలిసి మామను కారులో ఎక్కించుకుని బయటకు తీసుకెళ్లాడు. దారిలో మిత్రుడితో కలిసి ఆయనను హతమార్చి ప్రొద్దుటూరు సమీపంలోని పోట్లదుర్తి వద్ద రోడ్డుపై విసిరేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అక్కడున్న స్థానికులు ఇది గుర్తించి వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వారు నిందితులిద్దరినీ అరెస్టు చేసి రిమాండుకు పంపించారు. ఈ క్రమంలో మంగళవారం ప్రొద్దుటూరు న్యాయస్థానం న్యాయమూర్తి జీఎస్‌ రమేష్‌కుమార్‌ నేరస్థులకు జీవిత ఖైదు విధించడంతో పాటు ఒక్కొక్కరికి రూ. 11 లక్షల చొప్పున జరిమానా విధించారు. చెల్లించని పక్షంలో అదనంగా మరో ఎనిమిదేళ్లు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పునిచ్చారని సీఐ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు