Husband - Wife: దీపమే.. శాపమై..!

అన్యోన్య దాంపత్యం..ఆర్థికంగా స్థిరపడ్డారు. ఇద్దరు కుమారులు.. సుఖసంతోషాలతో సాగిపోతున్న వారి జీవితాన్ని విద్యుత్తు ప్రమాదం కబళించింది.

Updated : 22 Apr 2023 11:34 IST

దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతంతో భార్య మృతి
ఆమెను కాపాడే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన భర్త
ఒకరి తర్వాత ఒకరు క్షణాల్లోనే మృత్యుఒడికి
మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఘటన

చెన్నూరు, న్యూస్‌టుడే: అన్యోన్య దాంపత్యం..ఆర్థికంగా స్థిరపడ్డారు. ఇద్దరు కుమారులు.. సుఖసంతోషాలతో సాగిపోతున్న వారి జీవితాన్ని విద్యుత్తు ప్రమాదం కబళించింది. దంపతులిద్దర్నీ క్షణాల్లో మృత్యుఒడికి చేర్చింది. ఈ ప్రమాదానికి ఇంటి ఆవరణలో వెలుగుకోసం ఏర్పాటుచేసిన విద్యుద్దీపమే కారణం కావడం విషాదకరం.

మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణం లైన్‌గడ్డ కాలనీలో చెన్నూరు స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు బొల్లంపల్లి శ్రీనివాస్‌(44), ఆయన భార్య శశిదేవి అలియాస్‌ జయశ్రీ(38) నివాసం ఉంటున్నారు. వారికి ఇంటర్‌, పదో తరగతి చదువుతున్న చరణ్‌రాజ్‌, పవన్‌తేజ్‌ కుమారులున్నారు. ఉదయమే నిద్రలేచిన శశిదేవి ముందుగా గురువారం రాత్రి వీచిన ఈదురుగాలులు, వర్షం కారణంగా ఇంటి ఆవరణలో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేశారు. తీగపై ఆరేసిన దుస్తులు గాలికి కిందపడి ఉండటాన్ని గుర్తించి, వాటిని మళ్లీ అదే తీగపై వేసే ప్రయత్నం చేశారు. ఆ తీగకు విద్యుత్తు సరఫరా జరగడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడే ఉన్న కారు వైపు వాలిపోయారు. ఆ అలికిడికి ఇంట్లోంచి పరుగున వచ్చిన భర్త ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అతనికీ విద్యుత్తు ప్రసారమైంది. ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.

చిన్న ఏమరుపాటుతో

ఇంటి ఆవరణలోకి వెలుగు వచ్చేందుకు వీలుగా ప్రధాన గేటు అమర్చిన గోడకు విద్యుద్దీపం  ఏర్పాటుచేసి ఉంది. దీపం ఉన్న గొట్టానికి, ఇంకోవైపున్న కమ్మీకి మధ్య తీగ కట్టుకుని దుస్తులు ఆరేసుకునే ఏర్పాటు చేసుకున్నారా దంపతులు. రాత్రి కురిసిన వర్షానికి విద్యుద్దీపం ద్వారా గొట్టానికి, దాన్నుంచి తీగకు విద్యుత్తు ప్రసారమైంది. ఈ విషయం తెలియని ఆమె యథావిధిగా దుస్తులు ఆరేస్తూ తీగకు చెయ్యి తగిలి విద్యుదాఘాతానికి గురవగా, పడిపోయిన ఆమెను కాపాడాలనే తాపత్రయంలో భర్త ప్రమాదంలో పడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని