Karimnagar: ఇంటెలిజెన్స్‌ సీఐ వల్లే చనిపోతున్నా..!

‘నా టైమ్‌ బాగోలేదు.. నేనెవరికీ అన్యాయం చేయలేదు. సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ సీఐ గోపీకృష్ణ సార్‌ వల్లే నేను చనిపోతున్నా.. సీఐ సారు కొన్న ప్లాట్‌ అమ్ముడుపోవట్లేదు.

Updated : 23 Apr 2023 07:56 IST

పది పేజీల లేఖ రాసి వ్యక్తి ఆత్మహత్య
భూమి విక్రయం విషయంలో వేధించాడని ఆవేదన


‘నా టైమ్‌ బాగోలేదు.. నేనెవరికీ అన్యాయం చేయలేదు. సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ సీఐ గోపీకృష్ణ సార్‌ వల్లే నేను చనిపోతున్నా.. సీఐ సారు కొన్న ప్లాట్‌ అమ్ముడుపోవట్లేదు. ఆయన విషయంలో భయమేస్తోంది. నేను కేవలం ప్లాట్‌ అమ్మి 10 లక్షల లాభం చూపిస్తానని చెప్పా. కానీ అమ్ముడు పోనిది 10 లక్షలు ఎలా తేవాలి. రోజూ బతికి చచ్చేకంటే.. ఒకేసారి చచ్చిపోదామనుకుంటున్నా. గోపీకృష్ణ సార్‌ వల్ల నా కుటుంబానికి కూడా ప్రాణహాని ఉంది. కావాలంటే నా ఫోన్‌లో రికార్డులు చెక్‌ చేయండి. మొత్తం విషయం బాలాజీ సార్‌కు తెలుసు. సారీ.. సుజాతా.. నేను నీకు అన్యాయం చేస్తున్నా బిట్టు, కావ్యలను చూసుకో. ధైర్యంగా ఉండు. నాకు యముడిలాగా గోపీ సారు తగిలిండు.. నన్ను బతకనివ్వడు.. అందుకే చనిపోతున్న.’

 ఆత్మహత్య లేఖలో శ్యామ్‌ రాసిన మాటలు


కరీంనగర్‌ - (ఈనాడు), చొప్పదండి (న్యూస్‌టుడే): తాను కొన్న భూమిని తిరిగి విక్రయించలేదంటూ.. పోలీసు అధికారి వేధించడంతో ఒక వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న వైనమిది. భూమిని విక్రయించాలని సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ సీఐ గోపీకృష్ణ తనను పదేపదే బెదిరిస్తున్నారంటూ కరీంనగర్‌కు చెందిన బొడిగె శంబయ్య అలియాస్‌ శ్యామ్‌ (55) అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డారు. గోపీకృష్ణ వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని శ్యామ్‌ పది పేజీల లేఖ రాశారు. చొప్పదండి సీఐ రవీందర్‌, బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలం భూపాలపట్నం గ్రామంలో శ్యామ్‌  భూముల క్రయవిక్రయాల్లో మధ్యవర్తిగా వ్యవహరిస్తుంటారు. కరీంనగర్‌లోని విద్యారణ్యపురిలో అద్దె ఇంట్లో భార్యతో కలిసి నివసిస్తున్నారు. వీరి కుమారుడు సంజయ్‌ (బిట్టు), కుమార్తె కావ్య హైదరాబాద్‌లో హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్నారు.

కరీంనగర్‌ బ్యాంకు కాలనీలో నివసిస్తున్న సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ సీఐ కురికాల గోపీకృష్ణ భూపాలపట్నంలో 8 నెలల కిందట శ్యామ్‌ మధ్యవర్తిత్వంతో 20 గుంటల భూమిని రూ.50 లక్షలకు కొనుగోలు చేశారు. అయిదారు నెలల్లో రూ.10 లక్షలు లాభం వచ్చేలా విక్రయిస్తానని గోపీకృష్ణకు శ్యామ్‌ చెప్పారు. కానీ భూమిని విక్రయించలేకపోవడంతో సీఐ గోపీకృష్ణ ఒత్తిడి చేశారు. తనకు భూమిని అమ్మిపెట్టడంతోపాటు అదనంగా రూ.10 లక్షల లాభం ఇవ్వాల్సిందేనని సీఐ పట్టుబట్టడంతో శ్యామ్‌ రూ.3 లక్షలు అప్పు చేసి ఆయనకు చెల్లించారు. తన బావ పేరిట భూమి కొనేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. భూమి విక్రయించడంతోపాటు జాప్యానికి రూ.10 లక్షలు అదనంగా చెల్లిస్తానని శ్యామ్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో గోపీకృష్ణకు ఒప్పంద పత్రాన్ని రాసిచ్చారు.

గురువారం గోపీకృష్ణ ఫోన్‌ చేసి తీవ్రంగా మాట్లాడడంతో కుంగిపోయిన శ్యామ్‌ శుక్రవారం మధ్యాహ్నం భూపాలపట్నం వెళ్తున్నానని బయలుదేరారు. అక్కడి సొంత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. శనివారం ఉదయం స్థానికులిచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. మృతదేహాన్ని కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆయన మృతదేహంపై భార్య, పిల్లలు పడి రోదించిన తీరు ప్రతి ఒక్కరినీ కలచివేసింది. సీఐ గోపీకృష్ణను కఠినంగా శిక్షించాలని, ఆయన ఫోన్‌ వస్తే తన తండ్రి ఇంట్లో భయంతో వణికేవారని శ్యామ్‌ కుమారుడు బిట్టు విలపిస్తూ చెప్పాడు. గోపీకృష్ణపై ఐపీసీ 306 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశామని, ఆయన పరారీలో ఉన్నాడని చొప్పదండి సీఐ రవీందర్‌ తెలిపారు.

నువ్వు సచ్చిపోతే సచ్చిపో.. నాకేమైతది.!

‘నువ్వు సచ్చిపోతే సచ్చిపో.. నాకేమైతది! నేను వచ్చి దండ వేసిపోత.. నేను ఇస్త పురుగుల మందు.. నీ భార్య పిల్లలే బిచ్చమెత్తుకుంటరు. నువ్వు పోతె నీ ఇల్లును జఫ్తు చేసుకుంట.’ అంటూ శ్యామ్‌తో గోపీకృష్ణ ఫోన్‌ సంభాషణలు పోలీసులకు లభించాయి. 30 నిమిషాల నిడివి ఉన్న మరో సంభాషణలో సీఐతో పాటు మరో మధ్యవర్తి బాలాజీ మాటలు కూడా వినిపించాయి. ‘పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్న సార్‌.. అమ్మకానికి పార్టీలు రావడం లేదు. కాల్మొక్త సారూ.. అమ్ముడు పోకపోతే చనిపోదామనుకుంటున్న’.. అని శ్యామ్‌ మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. ‘చొప్పదండి సీఐ.. నా జూనియర్‌. నీ బొక్కలు ఇరగ్గొడ్తడు. సచ్చిపో ఏమైతది.. సచ్చినా మనశ్శాంతి లేకుండా చేస్తాను. కొంత టైం అయినా తీసుకుని అమ్మిపెట్టు’ అన్న సీఐ మాటలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని