Eluru: వేడి నూనె ఒంటిపై పోసి చిత్రహింసలు

ప్రియురాలి ఒంటిపై వేడి నూనె పోసి ఆమెను చిత్రహింసలకు గురి చేశాడోయువకుడు. ఈ ఘటన ఏలూరు జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాలలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.

Updated : 24 Apr 2023 07:34 IST

ఇంజినీరింగ్‌ విద్యార్థినిపై ప్రియుడి ఘాతుకం

ఏలూరు టూటౌన్‌, న్యూస్‌టుడే: ప్రియురాలి ఒంటిపై వేడి నూనె పోసి ఆమెను చిత్రహింసలకు గురి చేశాడోయువకుడు. ఈ ఘటన ఏలూరు జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాలలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల మేరకు..ఏలూరు శివారు ప్రాంతానికి చెందిన ఓ యువతి కాకినాడలోని ఓ కళాశాలలో బీటెక్‌ తృతీయ సంవత్సరం చదువుతోంది. నాలుగేళ్ల కిందట దుగ్గిరాల జోసఫ్‌నగర్‌కు చెందిన సదర్ల అనుదీప్‌ అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. అనుదీప్‌ తల్లి ఏలూరులో హోంగార్డుగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 9న అనుదీప్‌ కాకినాడలోని కళాశాల వద్దకు వెళ్లి.. పెళ్లి పేరుతో యువతిని దుగ్గిరాల తీసుకొచ్చి ఓ గదిలో ఉంచాడు. అదే రోజు రాత్రి శారీరకంగా కలవాలంటూ ఒత్తిడి చేశాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో మరుసటి రోజు రాత్రి మద్యం తాగొచ్చి బలవంతం చేశాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో నూనె కాచి కాళ్లు, చేతుల మీద పోసి, అనంతరం అత్యాచారానికి పాల్పడ్డాడు. రోజూ చిత్రహింసలకు గురిచేసే వాడు. అనంతరం గదికి తాళం వేసి ఏమీ తెలియనట్లుగా బయటకు వెళ్లేవాడు.

ఈ నెల 22వ తేదీ రాత్రి మద్యం తాగి వచ్చి యువతిని పీకనొక్కి చంపేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆమె అతడిని పక్కకు తోసి ఫోను లాక్కుని తండ్రికి సమాచారం ఇచ్చింది. ఆమె కుటుంబ సభ్యులు వెళ్లే సరికే అతను అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలు ప్రస్తుతం ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోంది. యువతి తండ్రి మాట్లాడుతూ తన కుమార్తె నెల రోజుల కిందట కాకినాడ వెళ్లిందని, రాత్రి ఫోన్‌ చేసేంతవరకు అక్కడే ఉందని అనుకుంటున్నామని చెప్పారు. అనుదీప్‌ను కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని కోరారు. కాగా అనుదీప్‌, బాధిత యువతి వివాహం చేసుకున్నట్లు ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. వీరిద్దరూ మూడేళ్లగా సహజీవనం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్రీటౌను పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి మాట్లాడుతూ బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడిని పట్టుకుని చట్టప్రకారం శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు.


మంత్రి ఏం చేస్తున్నారు
సౌకర్యాలు కల్పించలేకపోతే ఆసుపత్రిని మూసేసుకోండి..?
మాజీ ఎమ్మెల్యే చింతమనేని ఆగ్రహం

ఏలూరు టూటౌన్‌, న్యూస్‌టుడే: ‘ఆసుపత్రిలో సౌకర్యాలు కల్పించకుండా ఆరోగ్యశాఖామంత్రి విడదల రజిని ఏం చేస్తున్నారని  మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ తీవ్రంగా మండిపడ్డారు. ప్రియుడి దాడిలో గాయపడి ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇంజినీరింగ్‌ విద్యార్థినిని ఆదివారం ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిందితుడిని చట్టపరంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలోని బర్నింగ్‌ వార్డులో ఏసీలు పనిచేయకపోవడం, మిగిలిన గదుల్లో సౌకర్యాలు లేకపోవడాన్ని గమనించి ఆసుపత్రి సూపరింటెండెంట్‌ విజయ్‌కుమార్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ‘గత ప్రభుత్వ హయాంలో నిధులు పుష్కలంగా వచ్చేవి. ఇప్పుడు ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. మీకు జీతాలు సక్రమంగా వస్తున్నాయి కదా.. రాకపోతే ఆ నొప్పి తెలిసేది. సౌకర్యాలు కల్పించలేకపోతే ఆసుపత్రి మూసేస్తున్నామంటూ బోర్డు పెట్టుకోండి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం చింతమనేని కలెక్టర్‌తో మాట్లాడగా 15 రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని