Warangal: మత్తు మందు ఇచ్చి.. వివాహితపై గ్యాంగ్‌రేప్‌..

వరంగల్‌కు చెందిన వివాహిత(32)పై అయిదుగురు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Published : 03 May 2023 08:33 IST

నిందితులపై అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు

ఈనాడు, వరంగల్‌, ఎనుమాముల మార్కెట్‌, న్యూస్‌టుడే: వరంగల్‌కు చెందిన వివాహిత(32)పై అయిదుగురు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం మామునూరు ఏసీపీ తాళ్లపల్లి కృపాకర్‌ తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్‌ పైడిపల్లికి చెందిన వివాహిత హనుమకొండ బీమారంలోని ఓ కర్రీపాయింట్‌లో పని చేస్తున్నారు. ఏప్రిల్‌ 20న ఓ స్నేహితురాలు ఫోన్‌ చేసి పని ఉందని, ఆరెపల్లికి రావాలని సూచించగా... ఆమె భర్త తనని బైక్‌పై తీసుకొచ్చి, వదిలి వెళ్లిపోయారు. అప్పటికే స్నేహితురాలు వేచి చూస్తున్నారు. కాసేపటికి అక్కడికి ఓ కారులో రవి, డి.నాగరాజు వచ్చి వీళ్లిద్దరినీ అందులో ఎక్కించుకున్నారు. కారు ములుగు జిల్లా సరిహద్దుకు వెళ్లాక స్నేహితురాలు దిగిపోయారు.

అక్కడ ఎ.రమేశ్‌, బి.లక్ష్మణ్‌, బి.సుధాకర్‌ అనే ముగ్గురు వ్యక్తులు కారులోకి ఎక్కారు. మహిళకు మత్తు మందు ఇచ్చారు. ఆమెకు మెలకువ వచ్చే సరికి కారు మేడారం అటవీ ప్రాంతంలో ఉంది. అక్కడ ఎస్‌.రవి, డి.నాగరాజు, బి.లక్ష్మణ్‌ కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఎ.రమేష్‌, బి.సుధాకర్‌ వారికి సహకరించారు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి, ములుగులో బస్సు ఎక్కించారు. ఆరెపల్లి వద్ద బస్సు దిగి భర్తకు ఫోన్‌ చేయగా.. ఎందుకు ఆలస్యమైందని మందలించారు. దాంతో ఆమె కరీంనగర్‌లోని రామడుగులో ఉండే తల్లి వద్దకు వెళ్లారు. రెండు, మూడు రోజులైనా భార్య ఇంటికి రాకపోవడంతో భర్త ఏప్రిల్‌ 25న ఎనుమాముల ఠాణాలో ఫిర్యాదు చేయగా మిస్సింగ్‌ కేసు నమోదైంది. ఈ క్రమంలో బాధితురాలు కులపెద్ద సహకారంతో భర్త వద్దకు వచ్చి... ఆయనకు విషయమంతా తెలిపింది. దాంతో ఏప్రిల్‌ 29న అయిదుగురు యువకులపై ఎనుమాముల స్టేషన్‌లో ఆయన ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు నిందితులపై అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, రిమాండుకు తరలించారు. బాధితురాలి స్నేహితురాలు పరారీలో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని