జమ్మూకశ్మీర్‌లో కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్‌.. సిరిసిల్ల జిల్లాకు చెందిన టెక్నీషియన్‌ మృతి

భారత సైన్యానికి చెందిన తేలికపాటి హెలికాప్టర్‌ ధ్రువ్‌ గురువారం ఉదయం ప్రమాదానికి గురైంది. సాంకేతిక లోపం తలెత్తడంతో జమ్మూకశ్మీర్‌లోని కిశ్త్‌వాడ్‌ జిల్లా అటవీ ప్రాంతంలో అత్యవసరంగా దించేందుకు ప్రయత్నిస్తుండగా కుప్పకూలింది.

Updated : 05 May 2023 10:01 IST

జమ్మూ: భారత సైన్యానికి చెందిన తేలికపాటి హెలికాప్టర్‌ ధ్రువ్‌ గురువారం ఉదయం ప్రమాదానికి గురైంది. సాంకేతిక లోపం తలెత్తడంతో జమ్మూకశ్మీర్‌లోని కిశ్త్‌వాడ్‌ జిల్లా అటవీ ప్రాంతంలో అత్యవసరంగా దించేందుకు ప్రయత్నిస్తుండగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో సాంకేతిక నిపుణుడు పబ్బల్ల అనిల్‌(29) మృతి చెందగా, ఇద్దరు పైలట్లు గాయపడ్డారు. అనిల్‌ తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లావాసి. మరువా నదీతీరాన క్షతగాత్రులను, హెలికాప్టర్‌ శకలాలను గుర్తించారు. ఆర్మీ సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. చుట్టుపక్కల గ్రామాలవారు వీరికి సహకరించారు.

గాయపడిన పైలట్‌, కో పైలట్లను ఉధంపుర్‌ ఆసుపత్రికి తరలించినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. వీరి పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ప్రమాద ఘటనపై ఆర్మీ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ధ్రువ్‌ హెలికాప్టర్లు ప్రమాదాలకు గురవడం గత రెండు నెలల్లో ఇది రెండోసారి. గత మార్చి నెల 8న మన నౌకాదళానికి చెందిన ఏఎల్‌హెచ్‌ ధ్రువ్‌ ముంబయి తీరంలో ప్రమాదానికి గురైంది. అందులోని ముగ్గురు సిబ్బందిని నేవీ పెట్రోలింగ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సాయంతో రక్షించారు. ఈ ఘటన తర్వాత ధ్రువ్‌ హెలికాప్టర్ల వినియోగాన్ని త్రివిధ దళాల్లో నిలిపివేయగా.. గత సోమవారం నుంచే వాటి సేవలను పునరుద్ధరించారు. మార్చి 16న అరుణాచల్‌ ప్రదేశ్‌లో సైన్యానికి చెందిన ఏవియేషన్‌ చీతా హెలికాప్టర్‌ రోజువారీ శిక్షణలో ఉండగా కుప్పకూలి, ఇద్దరు పైలట్లు మృతిచెందిన విషయం తెలిసిందే.

మల్కాపూర్‌లో విషాదం

బోయినపల్లి, న్యూస్‌టుడే: జమ్మూకశ్మీర్‌లో ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలిన ఘటనలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్‌కు చెందిన సీఎఫ్‌ఎన్‌ ఏవీఎన్‌ టెక్నీషియన్‌ అనిల్‌(29) మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన పబ్బాల మల్లయ్య, లక్ష్మి దంపతుల కుమారుడైన అనిల్‌ డిగ్రీ పూర్తి చేశారు. ఆర్మీలో పదకొండేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. బోయినపల్లి మండలం కోరెం గ్రామానికి చెందిన సౌజన్యతో ఎనిమిదేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు అయాన్‌, అరావ్‌ ఉన్నారు. సుమారు నెల రోజుల క్రితం అనిల్‌ స్వగ్రామానికి వచ్చారు. చిన్న కుమారుడి పుట్టిన రోజు వేడుకల్లోనూ, అత్తగారి గ్రామం కోరెంలో జరిగిన బీరప్ప ఉత్సవాల్లో పాల్గొన్నారు. పది రోజుల క్రితం తిరిగి విధులకు వెళ్లారు. ఆయన మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాన్ని శుక్రవారం సాయంత్రం స్వగ్రామానికి తీసుకురానున్నట్లు సమాచారం. అనిల్‌ మృతి బాధాకరమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. అనిల్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా సంతాపం తెలిపారు.


జమ్మూకశ్మీర్‌లో రెండేళ్లలో 5 ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదాలు..

* జమ్మూకశ్మీర్‌లో గత రెండేళ్లలో గురువారం నాటి కిశ్త్‌వాడ్‌ జిల్లా ఘటనతోపాటు అయిదు ఆర్మీ హెలికాప్టర్లు ప్రమాదాల బారినపడ్డాయి.

* 2021 జనవరి 25: పంజాబ్‌ సరిహద్దులోని కథువా జిల్లా లఖన్‌పుర్‌ వద్ద ‘ధ్రువ్‌’ కూలిన ఘటనలో ఓ పైలట్‌ మృతిచెందగా, మరొకరు గాయపడ్డారు.

* 2021 ఆగస్ట్‌ 3: కథువా - పఠాన్‌కోట్‌ సరిహద్దులోని రంజిత్‌సాగర్‌ డ్యాంలో ‘రుద్ర’ హెలికాప్టర్‌ కూలి, ఇద్దరు పైలట్లు మృతిచెందారు.

* 2021 సెప్టెంబరు 21: ఉధంపుర్‌ జిల్లాలోని పటనీటాప్‌ వద్ద ‘చీతా’ హెలికాప్టర్‌ దట్టమైన అడవిలో కూలడంతో ఇద్దరు పైలట్లు దుర్మరణం చెందారు.

* 2022 మార్చి 11: ఉత్తర కశ్మీర్‌లోని బాండీపోరా జిల్లా గురేజ్‌ సెక్టారులో ‘చీతా’ చాపర్‌ కూలి కో పైలట్‌ మృతిచెందగా, పైలట్‌ గాయపడ్డారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని