Kerala: చికిత్స చేస్తున్న వైద్యురాలిని పొడిచి చంపేశాడు!

కేరళలోని కొల్లాం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన గాయానికి చికిత్స చేస్తున్న వైద్యురాలిని ఓ రోగి మద్యం మత్తులో కత్తితో కిరాతకంగా పొడిచి చంపాడు.

Updated : 11 May 2023 09:37 IST

కేరళ ఆసుపత్రిలో దారుణానికి పాల్పడ్డ రోగి

కొల్లాం, తిరువనంతపురం: కేరళలోని కొల్లాం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన గాయానికి చికిత్స చేస్తున్న వైద్యురాలిని ఓ రోగి మద్యం మత్తులో కత్తితో కిరాతకంగా పొడిచి చంపాడు. అడ్డుకోవడానికి యత్నించిన పోలీసులనూ గాయపర్చాడు. కొట్టరక్కరలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభుత్వ ఉపాధ్యాయుడైన నిందితుడు సందీప్‌ బుధవారం తెల్లవారుజామున తన కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు. హెల్ప్‌లైన్‌ నంబరుకు ఫోన్‌ చేసి తనను కాపాడాలని అభ్యర్థించాడు. పోలీసులు అతడి ఇంటికి వెళ్లేసరికి కాలికి గాయంతో కనిపించాడు. చికిత్స కోసం వారు అతణ్ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న అతడు బీభత్సం సృష్టించాడు. పోలీసులు అతణ్ని బలవంతంగా వందనా దాస్‌ అనే వైద్యురాలు(23) ఉన్న గదికి తీసుకెళ్లారు. ఆ తర్వాత వారు బయట వేచి ఉండగా ఒక్కసారిగా వందన బిగ్గరగా కేకలు వేసుకుంటూ బయటకు వచ్చారు. ఆమె వెంటే నిందితుడు కత్తెర, కత్తి పట్టుకుని వచ్చి చంపేస్తానంటూ కేకలు వేస్తూ దాడికి దిగాడు.

వందనను కత్తితో పలుమార్లు పొడిచాడు. అడ్డుకోబోయిన పోలీసులనూ గాయపర్చాడు. చివరకు పోలీసులు నిందితుణ్ని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. తీవ్రంగా గాయపడ్డ వందనను తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి ఆమె ప్రాణాలు కోల్పోయారు. నిందితుడు అనూహ్యంగా ఎందుకు దాడికి దిగాడో తెలియడం లేదని పోలీసులు తెలిపారు. అతడు మద్యానికి బానిసై తరచూ గొడవ పడేవాడని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైద్యులు ఆందోళన చేపట్టారు.  వైద్యురాలి హత్యపై కేరళ హైకోర్టు సైతం తీవ్రంగా స్పందించింది. ఈ ఘటన వ్యవస్థ వైఫల్యమేనని పేర్కొంది. వైద్యురాలిని రక్షించడంలో పోలీసులు విఫమయ్యారని, అలాంటప్పుడు వారి అవసరం ఏముందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటనపై వారంలోపు నివేదిక సమర్పించాలని కేరళ మానవ హక్కుల కమిషన్‌ పోలీసులను ఆదేశించింది. సందీప్‌ను రాష్ట్రప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని