మద్యం మత్తులో కుమార్తె హత్య

పెద్దపల్లి జిల్లా మంథని మండలం భట్టుపల్లిలో ఓ వ్యక్తి తన కుమార్తెను గొడ్డలితో దారుణంగా నరికాడు. మరో వ్యక్తిపైనా దాడి చేశాడు.

Published : 12 May 2023 06:01 IST

గొడ్డలితో నరికిన కసాయి తండ్రి

పెద్దపల్లి, ఈనాడు డిజిటల్‌, మంథని గ్రామీణం, న్యూస్‌టుడే: పెద్దపల్లి జిల్లా మంథని మండలం భట్టుపల్లిలో ఓ వ్యక్తి తన కుమార్తెను గొడ్డలితో దారుణంగా నరికాడు. మరో వ్యక్తిపైనా దాడి చేశాడు. గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్‌ తెలిపిన ప్రకారం... స్థానికుడైన గుండ్ల సదానందం మద్యానికి బానిసయ్యాడు. అతని భార్య శ్రీలత ఆర్నెళ్ల కిందట ఆత్మహత్య చేసుకుంది. అతనికి కుమారుడు అంజి(20), కుమార్తె రజిత(11) ఉన్నారు. డ్రైవర్‌గా పనిచేస్తున్న కుమారుడే కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రజిత ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి పూర్తిచేసింది. భార్య చనిపోయాక సదానందం విపరీతంగా మద్యం తాగుతూ అందరితో గొడవ పడుతున్నాడు. కుటుంబ సభ్యులు నచ్చజెప్పినా ప్రవర్తనలో మార్పు రాలేదు. గురువారం ఉదయం ఇంట్లో నిద్రిస్తున్న రజిత మెడపై గొడ్డలితో నరకడంతో అక్కడికక్కడే చనిపోయింది. అదే గొడ్డలితో సమీపంలోని కిరాణ దుకాణ యజమాని, ఎల్‌ఐసీ ఏజెంట్‌ దూపం శ్రీనివాస్‌ మెడపై దాడి చేశాడు. బాధితుడిని కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతనికి 12కుట్లు పడగా పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు.

తామే శిక్షిస్తామంటూ గ్రామస్థుల ఆందోళన

సదానందం గతంలో భార్యను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని గ్రామస్థులు ఆరోపించారు. ఆమె బీమా డబ్బులను కూతురుకు కాకుండా తనకే వచ్చేలా చూడాలని సదానందం కోరగా... ఏజెంట్‌ శ్రీనివాస్‌ అడ్డుచెప్పినట్లు వారు చెబుతున్నారు. అందుకే నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పేర్కొంటున్నారు. అతన్ని తామే శిక్షిస్తామంటూ మూకుమ్మడిగా దాడి చేశారు. పోలీసుల వాహనానికి అడ్డంగా బండరాళ్లు పెట్టారు. టైర్లు, అద్దాలు, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. కొందరు మహిళలు నిందితుడి కంట్లో కారం చల్లారు. అది పలువురు పోలీసుల కళ్లల్లోనూ పడింది. ఏసీపీ గిరిప్రసాద్‌ వచ్చి గ్రామస్థులను శాంతింపజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని