Warangal - junior panchayat secretary: జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య

కుటుంబం కలహాలు, ఉద్యోగ భద్రత లేమితో మనస్తాపం చెందిన ఓ జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి(జేపీఎస్‌) ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Updated : 13 May 2023 08:18 IST

ప్రభుత్వం న్యాయం చేయాలని జేపీఎస్‌ల ఆందోళన

ఖానాపురం, న్యూస్‌టుడే: కుటుంబం కలహాలు, ఉద్యోగ భద్రత లేమితో మనస్తాపం చెందిన ఓ జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి(జేపీఎస్‌) ఆత్మహత్యకు పాల్పడ్డారు. వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలంలో శుక్రవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. నర్సంపేట మండల కేంద్రానికి చెందిన బైరి సోని(29)కి తొమ్మిదేళ్ల క్రితం వరంగల్‌లోని రంగసాయిపేటకు చెందిన ప్రసాద్‌తో వివాహమైంది. ఖానాపురం మండలం రంగాపురంలో నాలుగేళ్ల నుంచి జేపీఎస్‌గా విధులు నిర్వహిస్తున్నారు. సర్వీసు క్రమబద్ధీకరించాలంటూ జేపీఎస్‌లు ఇటీవల చేపట్టిన ఆందోళనల్లోనూ చురుగ్గా పాల్గొన్న ఆమె.. ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో ఈ నెల 6న విధుల్లో చేరారు. ఇదిలా ఉండగా.. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య ఆర్థిక సంబంధ గొడవలు జరుగుతున్నాయి. భర్త వేధింపులకు తోడు ఉద్యోగ భద్రతపై ఆందోళన ఆమెను కుంగదీశాయి.

శుక్రవారం ఉదయం ఇంటి నుంచి బయలుదేరిన సోని మార్గమధ్యలో పురుగుమందు తాగారు. అక్కడి నుంచి నేరుగా రంగాపురం గ్రామపంచాయతీకి వెళ్లి సహచర కార్యదర్శులకు ఫోన్‌ ద్వారా విషయం చెప్పారు. వెంటనే అక్కడి సిబ్బంది నర్సంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. ఉద్యోగ భద్రత లేదనే భయం, కుటుంబ ఇబ్బందుల వల్లనే సోని ఆత్మహత్యకు పాల్పడ్డారంటూ జేపీఎస్‌లు నర్సంపేట మార్చురీ వద్ద ఆందోళనకు దిగారు. సోని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించకుండా అంబులెన్స్‌ను అడ్డుకుని నిరసన తెలిపారు. వారిని తొలగించే క్రమంలో కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతరం కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి సోని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆర్డీవో శ్రీనివాసులు, డీసీపీ కరుణాకర్‌, డీపీవో కల్పన శుక్రవారం రాత్రి ఆందోళనకారులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషనుకు తరలించారు. సోని తండ్రి శ్రీనివాస్‌ ఫిర్యాదు మేరకు సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని నర్సంపేట ఏసీపీ సంపత్‌కుమార్‌ తెలిపారు. ప్రసాద్‌, సోని దంపతులకు ఏడేళ్ల కుమార్తె ఉంది.


సోని మృతికి ప్రభుత్వమే కారణం

బండి సంజయ్‌

ఈనాడు, హైదరాబాద్‌: సోని ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఒక ప్రకటనలో ఆరోపించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ సోని ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ శనివారం సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని భాజపా శ్రేణులకు పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు