పాపం పసివాడు వీధి కుక్కకు బలయ్యాడు

హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వేస్టేషన్‌ సమీపంలో శుక్రవారం ఏడేళ్ల బాలుడిపై వీధికుక్క దాడి చేయడంతో మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బనారస్‌ ప్రాంతానికి చెందిన మల్కాన్‌, సునీత దంపతులు సంచార జీవనం చేస్తూ.. బొమ్మలు విక్రయిస్తుంటారు.

Updated : 20 May 2023 05:59 IST

హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వేస్టేషన్‌ సమీపంలో శుక్రవారం ఏడేళ్ల బాలుడిపై వీధికుక్క దాడి చేయడంతో మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బనారస్‌ ప్రాంతానికి చెందిన మల్కాన్‌, సునీత దంపతులు సంచార జీవనం చేస్తూ.. బొమ్మలు విక్రయిస్తుంటారు. వీరు తమ ముగ్గురు పిల్లలతో బనారస్‌ నుంచి రాజస్థాన్‌లోని అజ్మేర్‌కు బయలుదేరారు. మార్గంలో వేరే రైలు ఎక్కేందుకు గురువారం రాత్రి కాజీపేట రైల్వే స్టేషన్‌లో దిగారు. శుక్రవారం ఉదయం ప్లాట్‌ఫాంపైనే వేచి ఉండగా.. వారి రెండో కుమారుడు చోటు (7) కాలకృత్యాలు తీర్చుకోవడానికి రైల్వేస్టేషన్‌ సమీపంలోని పార్కు వద్దకు వెళ్లాడు. అక్కడ ఒక వీధి కుక్క ఆ బాలుడిపై దాడి చేసింది. మెడ, మర్మావయవాలపై కరవడంతో తీవ్ర గాయాలయ్యాయి. సమీపంలో ఎవరూ లేకపోవడంతో బాలుడి కేకలు అరణ్య రోదనగా మారాయి. కొద్దిసేపటికి అటుగా వెళ్తున్న వారు చూసి కుక్కను తరిమికొట్టారు. బాలుడు తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. పోలీసులు, స్థానికులు 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా, అప్పటికే తుదిశ్వాస విడిచాడు. పసివాడిని పోగొట్టుకున్నామని తల్లిదండ్రులు విలపించిన తీరు కలచివేసింది. అన్న చోటు మృతదేహం వద్ద తమ్ముడు ఖలీల్‌ కూర్చొని విలపించిన దృశ్యం అందరినీ కంటతడి పెట్టించింది. కాజీపేట ఎస్సై రవికుమార్‌ బాలుడి మృతదేహాన్ని వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. బాలుడి కుటుంబాన్ని ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ పరామర్శించి.. రూ.లక్ష ఆర్థికసాయం అందించారు.
 న్యూస్‌టుడే, కాజీపేట టౌన్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు