పోలీసుల అదుపులో బాలినేని వియ్యంకుడి మాజీ పీఏ!

తోట ఆంజనేయులు అనే వ్యక్తిని ప్రకాశం జిల్లా పోలీసులు ఆదివారం రాత్రి అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు.

Updated : 22 May 2023 05:23 IST

భాస్కరరెడ్డిపై ఆరోపణల నేపథ్యంలో అక్రమ నిర్బంధం!

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: తోట ఆంజనేయులు అనే వ్యక్తిని ప్రకాశం జిల్లా పోలీసులు ఆదివారం రాత్రి అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. ఆయన సంతనూతలపాడు మండలం ఎండ్లూరులోని స్వగ్రామంలో తన తల్లి సీతమ్మ పెద్దకర్మ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఒంగోలు వస్తుండగా ఆంజనేయులు, ఆయన భార్య పద్మజను మఫ్టీలో ఉన్న పోలీసులు ఎండ్లూరు డొంక వద్ద అడ్డుకున్నారు. వారిని మద్దిపాడు స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నట్లు సమాచారం. ఆంజనేయులు సుమారు పద్దెనిమిదేళ్లపాటు మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వియ్యంకుడైన కుండా భాస్కరరెడ్డి వద్ద పీఏగా పనిచేశారు. విశాఖలో ఉంటూ భాస్కరరెడ్డికి సంబంధించిన వ్యాపార, ఇతరత్రా లావాదేవీలను చక్కబెట్టేవారు. అయిదు నెలల క్రితం ఉద్యోగం మానేశారు. ఇటీవల భాస్కరరెడ్డిపై విశాఖకు చెందిన జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల వెనుక ఆంజనేయులు హస్తం ఉందని భాస్కరరెడ్డి వర్గీయులు అనుమానిస్తున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో విశాఖలో ఆయనపై కేసులు పెట్టినట్లు సమాచారం. దీంతో తనను అరెస్టు చేయకుండా ఆంజనేయులు ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయినా తల్లి పెద్దకర్మకు వచ్చిన ఆంజనేయులు, ఆయన భార్య పద్మజను అదుపులోకి తీసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయంపై పోలీసు అధికారులెవరూ నోరు మెదపటం లేదు. ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో పద్మజను పోలీసులు విడిచిపెట్టినట్లు తెలిసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు