విక్రయాల ప్రయాసలో ప్రాణమే పోయింది

కొనుగోలు కేంద్రంలో ఎంతకీ ధాన్యం తూకం వేయకపోవడంతో నేరుగా రైస్‌ మిల్లులో అమ్ముదామని ద్విచక్ర వాహనంపై బయలుదేరిన ఇద్దరు రైతుల్లో ఒకరు దుర్మరణం చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

Published : 26 May 2023 04:37 IST

ధాన్యం అమ్మేందుకు వెళుతున్న రైతు దుర్మరణం

నర్సాపూర్‌, న్యూస్‌టుడే: కొనుగోలు కేంద్రంలో ఎంతకీ ధాన్యం తూకం వేయకపోవడంతో నేరుగా రైస్‌ మిల్లులో అమ్ముదామని ద్విచక్ర వాహనంపై బయలుదేరిన ఇద్దరు రైతుల్లో ఒకరు దుర్మరణం చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ ఎస్సై శివకుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నర్సాపూర్‌ మండలం సీతారాంపూర్‌ గ్రామానికి చెందిన రైతు మూసగల్ల శ్రీనివాస్‌(40) తన ఎకరం భూమిలో పండించిన ధాన్యాన్ని 15 రోజుల కిందట ఐకేపీ కొనుగోలు కేంద్రానికి తరలించారు. వర్షానికి తడిసి, ఎండకు ఎండుతున్నా.. తూకం వేయకపోవడంతో తీవ్ర ఆవేదన చెందారు. ఏదో ఒక ధరకు ప్రైవేటు రైస్‌మిల్లులో విక్రయించాలని భావించారు. అదే గ్రామానికి చెందిన మరో రైతు వెల్మకన్నె కృష్ణదీ ఇదే పరిస్థితి. ఇద్దరూ కలసి ఓ రైస్‌మిల్లు యాజమాన్యంతో మాట్లాడదామని ద్విచక్రవాహనంపై బయలుదేరారు. మార్గం మధ్యలో సంగారెడ్డి వైపు నుంచి వస్తున్న ఆటో ఢీకొనడంతో శ్రీనివాస్‌ అక్కడికక్కడే మరణించాడు. ద్విచక్ర వాహనంపైనే మృతదేహం పడి ఉండటం చూపరులను కలచివేసింది. కృష్ణకు తీవ్రగాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉంది. ఆయనను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాస్‌కు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని