పెళ్లయిన ఏడాదిన్నరకే భర్త మరణం.. తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య

పెళ్లయిన ఏడాదిన్నరకే భర్త అకస్మాత్తుగా మరణించడం ఆమెను ఒంటరిని చేసింది. ఆయన అంత్యక్రియలు జరిగిన మరుసటి రోజే.. ఆమె కూడా ఆత్మహత్యకు పాల్పడింది. 

Published : 26 May 2023 04:37 IST

అంత్యక్రియలు జరిగిన మరుసటి రోజే ఘటన

అంబర్‌పేట, న్యూస్‌టుడే: పెళ్లయిన ఏడాదిన్నరకే భర్త అకస్మాత్తుగా మరణించడం ఆమెను ఒంటరిని చేసింది. ఆయన అంత్యక్రియలు జరిగిన మరుసటి రోజే.. ఆమె కూడా ఆత్మహత్యకు పాల్పడింది.  హైదరాబాద్‌లోని అంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌, అడ్మిన్‌ ఎస్సై మల్లేశం తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్‌పేట డీడీ కాలనీకి చెందిన సురేశ్‌, ఉమల కుమార్తె సాహితి (29) వివాహం ఏడాదిన్నర క్రితం వనస్థలిపురం ప్రాంతానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మనోజ్‌తో జరిగింది. అనంతరం వారిద్దరూ అమెరికాకు వెళ్లి.. డాలస్‌లోని ఫ్రిస్కోలో నివసిస్తున్నారు. ఈ నెల 2న సాహితి.. తన తల్లిదండ్రులను చూడటానికి హైదరాబాద్‌ వచ్చింది. 20వ తేదీన ఆమె భర్త మనోజ్‌ అమెరికాలో గుండెపోటుతో హఠాత్తుగా మృతి చెందారు. 23న ఆయన మృతదేహాన్ని నగరానికి తీసుకురాగా.. మరుసటి రోజున వనస్థలిపురంలో అంత్యక్రియలు నిర్వహించారు. సాహితి అదేరోజు మధ్యాహ్నం తల్లిదండ్రులతో కలిసి అంబర్‌పేటలోని పుట్టింటికి వచ్చింది. తన చెల్లెలు సంజనతో కలిసి రాత్రి నిద్రించింది. గురువారం ఉదయం వనస్థలిపురంలో జరిగే.. మనోజ్‌ ఆరో రోజు కార్యక్రమానికి వెళ్లేందుకు ఆమె కుటుంబసభ్యులు సన్నద్ధమయ్యారు. ఈ క్రమంలో సంజన వాష్‌రూమ్‌కు వెళ్లి కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చింది. ఈలోపు సాహితి చీరతో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుంది. వెంటనే తల్లిదండ్రులు, సోదరి ఆమెను కిందకు దించి ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అనంతరం సాహితి నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేసి.. అంత్యక్రియలు పూర్తిచేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు