Palnadu: కుమారుడి తల తెగ్గోసిన కన్నతండ్రి.. ఆపై దాంతో ఊరంతా తిరిగిన ఉన్మాది

మద్యానికి బానిసైన తండ్రి ఉన్మాదిగా మారాడు. సొంత కుమారుడి తలను తెగ నరికాడు. దారుణ ఘటన పల్నాడు జిల్లా నకరికల్లు మండలంలోని గుళ్లపల్లిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది.

Updated : 27 May 2023 08:48 IST

పల్నాడు జిల్లాలో దారుణం

నకరికల్లు, రాజుపాలెం, న్యూస్‌టుడే: మద్యానికి బానిసైన తండ్రి ఉన్మాదిగా మారాడు. సొంత కుమారుడి తలను తెగ నరికాడు. దారుణ ఘటన పల్నాడు జిల్లా నకరికల్లు మండలంలోని గుళ్లపల్లిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. బత్తుల వీరయ్య కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. అతడి భార్య అలివేలమ్మ రెండేళ్ల కిందట కువైట్‌కు వెళ్లింది. వీరికి కుమారుడు అశోక్‌ (25), కుమార్తె ఉన్నారు. ఇద్దరికీ వివాహాలు చేశారు. అశోక్‌ భార్య ఇటీవల పుట్టింటికి వెళ్లగా.. తండ్రీకుమారులిద్దరే ఉంటున్నారు. 4 రోజుల కిందట అలివేలమ్మ కుమారుడి బ్యాంకు ఖాతాకు రూ.5 వేలు పంపింది. దీంతో మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వాలని వీరయ్య గొడవ పెట్టుకుంటున్నాడు. గురువారం రాత్రి తండ్రి, కుమారుడు వేర్వేరుగా మద్యం తాగి ఇంటికి వచ్చారు. ఆ మత్తులో ఇద్దరూ గొడవపడగా.. వీరయ్య కుమారుడి తలపై రాయితో బలంగా కొట్టాడు. అశోక్‌ కిందపడటంతో వెంటనే ఇంట్లోంచి కత్తి తెచ్చి తలను మొండెం నుంచి వేరు చేశాడు. ఓ బస్తాలో తలను వేసుకొని గ్రామంలోని బెల్టుషాప్‌ వద్దకు చేరుకుని మద్యం తాగాడు. ఆ తర్వాత కుమారుడి తల తెగ నరికానంటూ గ్రామంలో తిరుగుతుండగా స్థానికులు పోలీసులకు తెలిపారు. పోలీసులువచ్చి వీరయ్యను స్టేషన్‌కు తరలించారు. అశోక్‌ భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు సత్తెనపల్లి గ్రామీణ సీఐ చిట్టెం కోటేశ్వరరావు శుక్రవారం కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని