ఉగ్రదాడులకు విదేశీ నిధులు!

భోపాల్‌-హైదరాబాద్‌ మాడ్యూల్‌ ఉగ్ర సంస్థ హిజ్బ్‌-ఉత్‌-తహ్రీర్‌ (హెచ్‌యూటీ) కార్యకలాపాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దృష్టి సారించింది.

Updated : 27 May 2023 06:34 IST

హిజ్బ్‌-ఉత్‌-తహ్రీర్‌పై రంగంలోకి ఎన్‌ఐఏ
నిందితుల సెల్‌ఫోన్ల విశ్లేషణతో విస్మయకర కోణాలు

ఈనాడు, హైదరాబాద్‌: భోపాల్‌-హైదరాబాద్‌ మాడ్యూల్‌ ఉగ్ర సంస్థ హిజ్బ్‌-ఉత్‌-తహ్రీర్‌ (హెచ్‌యూటీ) కార్యకలాపాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దృష్టి సారించింది. ఈ కేసు మధ్యప్రదేశ్‌ పోలీసుల నుంచి ఎన్‌ఐఏకు అధికారికంగా బదిలీ కానుంది. రెండు రోజుల క్రితం భోపాల్‌కు వెళ్లిన ఎన్‌ఐఏ బృందం కేస్‌ డైరీని స్వాధీనం చేసుకుంది. ఒకట్రెండు రోజుల్లో ఎన్‌ఐఏ ఈ కేసును తిరిగి నమోదు చేయనుంది. ముఖ్యంగా ఉగ్రదాడుల కుట్రలో విదేశీ సంస్థల హస్తంపై ఆరా తీయనుంది. హెచ్‌యూటీకి విదేశాల నుంచి నిధులు అందుతున్నాయనే అనుమానాలపై కూపీ లాగనుంది. తొలుత మధ్యప్రదేశ్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌(ఏటీఎస్‌), ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ), తెలంగాణ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌(సీఐ) సెల్‌ సంయుక్తంగా ఆ సంస్థ కార్యకలాపాల్ని భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఈనెల 9న భోపాల్‌, ఛింద్వారా, హైదరాబాద్‌లలో ఏకకాలంలో దాడులు నిర్వహించి 16 మందిని అరెస్టు చేసింది. కేసు దర్యాప్తు క్రమంలో నిందితుల నుంచి స్వాధీనం చేసుకొన్న సెల్‌ఫోన్లను విశ్లేషించిన అనంతరం విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి.

హెచ్‌యూటీ సభ్యులు వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడి జిమ్‌ శిక్షకులుగా, దర్జీలుగా, కంప్యూటర్‌ ఆపరేటర్లుగా, ఆటోడ్రైవర్లుగా పనిచేస్తూనే రహస్య సమావేశాల ద్వారా ఉగ్రదాడులకు కుట్రలు పన్నినట్లు తేలింది. నగరాల సమీపంలోని అడవుల్లో ఆయుధాలను ఉపయోగించడంలో శిక్షణ పొందినట్లు వెల్లడైంది. భారీ దాడులకు ప్రణాళిక రచించడంలో నిమగ్నమైనట్లు గుర్తించారు. ఆత్మహుతి దాడులకూ కుట్ర పన్నినట్లు ఆధారాలు లభించాయి. నిందితుల్లో అయిదుగురు మతం మార్చుకోగా, ఇద్దరు ఇతర మతాల అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నట్లు దర్యాప్తు క్రమంలో బహిర్గతమైంది. నిందితుల సెల్‌ఫోన్లలో పాకిస్థాన్‌కు చెందిన నంబర్లు ఉండటాన్నీ దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. అలాగే విదేశీ నిధుల కోణమూ బహిర్గతమైంది. మున్ముందు హెచ్‌యూటీ సభ్యులు దేశవ్యాప్తంగా భారీ దాడులకు పాల్పడేందుకు విదేశాల నుంచే ఆర్థికసహాయం అందనుందనే అనుమానాలపై ఇప్పటికే పలు ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే విషయ తీవ్రత దృష్ట్యా జాతీయ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని